టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆస్పత్రిలో కనిపించగానే ఒక్కసారిగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. నిన్న సాయంత్రం ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారని తొడబాగం ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక వెంటనే ఆయన సన్నిహితులు అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు. అలాగే కృష్ణంరాజు కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది. మరికొన్ని రోజుల్లో యూకే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ..
రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు వెళ్లినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కృష్ణంరాజు ఇప్పటికే మెగాస్టార్ ను అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కృష్ణంరాజు వివరణ ఇచ్చారు. ఇక 81 ఏళ్ళ వయసులో ఉన్న కృష్ణం రాజు సినిమాలు బాగా తగ్గించేశారు.
చివరగా 2015లో రుద్రమదేవి అనంతరం మళ్ళీ మరో సినిమాలో కనిపించలేదు. ఇక మళ్ళీ ఏడేళ్ల అనంతరం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమా ద్వారా వెండితెరపై ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ – గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.