ప్రపంచ తెలుగు మహాసభలు గత ఐదు రోజులుగా వైభవంగా జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సభలు నిన్నటితో ముగిసాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద స్థాయిలో సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హాజరుకాలేకపోయారు. దానిపై ఆయన ఈరోజు స్పందించారు. “ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో పాటు ఈ నెల 18న చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించి సన్మానించిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.
అయితే ఈ వేడుకకు నేను హాజరు కాలేకపోవడానికి కారణం కేవలం సమాచార లోపమే. మరే ఇతర కారణాలు లేవు” అని స్పష్టం చేశారు. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ “కృష్ణదేవరాయల పాత్ర పోషించిన నాకు సీఎం కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం విన్నప్పుడు, అష్ట దిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన కృష్ణదేవరాయలు కేసీఆర్‌లో కనిపించారు. తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టు ఏంటో ప్రారంభోపన్యాసంలో కనిపించింది. తెలుగు భాషపై ఆయనకున్న అభిమానం ఏంటో ఈ మహాసభల నిర్వహణలో, తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో కనిపించింది.” అని అభినందించారు. అలాగే తెలుగుకు గౌరవాన్ని పెంచిన వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
“ఒకప్పుడు తెలుగుకు ప్రత్యేకత లేదు. మహానుభావుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు భాషకు, తెలుగు వారికి విశ్వవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. అందుకు ఎన్టీఆర్‌కి, రాజమౌళికి, ఈ మహాసభలను నిర్వహిస్తున్న కేసీఆర్‌కి, కేటీఆర్‌కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని కృష్ణం రాజు వెల్లడించారు.