ఎన్టీఆర్ బయోపిక్స్ గా వచ్చిన “ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాలు దారుణంగా విఫలమయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి “లక్ష్మీ ఎన్టీఆర్” మీద ఉంది. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాన్ని, అసలు కథను తెరకెక్కించానని ఆర్జీవీ చెబుతుండడం.. ట్రైలర్, ప్రోమోస్, సాంగ్స్ అన్నీ ఆసక్తికరంగా ఉండడంతో.. సినిమాపై బిజినెస్ సర్కిల్స్ లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆర్జీవి మునుపటి సినిమా “ఆఫీసర్” డిజాస్టర్ అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాపై ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే.. మార్చిలో ఎలక్షన్ కోడ్ జారీకానుంది. అది జరిగిందంటే పోలిటికల్ ఫిలిమ్స్ ట్రైలర్స్ కూడా టీవీలో ప్లే అవ్వవు. ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదలవ్వడం అనేది గగనమే. పోనీ ముందే రిలీజ్ చేద్దామంటే.. సెన్సార్ సమస్య వచ్చిపడింది. సినిమాలో చంద్రబాబునాయుడు మరియు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి చాలా సన్నివేశాలు, డైలాగులున్నాయి. ప్రస్తుతం సెన్సార్ నిబంధనల ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను చెడుగా చూపించడం అనేది తప్పుగా తీర్మానించి మామూలు సినిమాల్లో ఆ సన్నివేశాలున్నా కట్ చేసి పడేస్తున్నారు. అలా చూసుకుంటే.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాలో ఎన్ని సీన్స్ లేపేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ గొడవంతా ఎందుకని వర్మ హ్యాపీగా ఆన్లైన్ లో రిలీజ్ చేసేస్తాడా లేక వేరే ఏదైనా ఆప్షన్ కోసం చూస్తాడా అనేది చూడాలి.