సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలయ్యి రికార్డు వ్యూస్ రాబట్టింది. ఈ చిత్రంలో చంద్రబాబు మరియు నందమూరి ఫ్యామిలీల పై సెటైరికల్ గా తీసారని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని విడుదల కాకుండా… నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు నందమూరి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని తిరస్కరించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యల పై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు.
లక్ష్మీ పార్వతి ఈ విషయం పై స్పందిస్తూ… “తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. రాంగోపాల్ వర్మ చాలా ధైర్యంగా, నిజాయతీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. బాలకృష్ణ రూపొందించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో వాస్తవం లేదు కాబట్టే ప్రజలు ఆ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలియజేసారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఇన్నాళ్ళకు చంద్రబాబు పాపం పండింది. ‘వాటీజ్ దిస్ అనేది’…ఈ చిత్రంతోనే తెలుస్తుంది. వర్మకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళూ వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయింది. అప్పట్లో అకారణంగా నా పై నిందలు వేసి, అవాస్తవాలు ప్రచారం చేశారు. ఎన్టీఆర్ మరణం, ఆనాటి పరిణామాల పై విచారణ కమిటీ వేయాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి.