తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి మారుపేరు సూపర్ స్టార్ కృష్ణ. అతని నట వారసుడిగా మహేష్ బాబు అనేక సార్లు నిరూపించుకున్నారు. అపజయాలు పలకరించినప్పటికీ సాహాసోపేతమైన సినిమాలు చేయడంలో మహేష్ ముందు ఉంటారు. అలా కృష్ణ కి తగ్గ తనయుడిగా పేరు దక్కించుకున్నారు. అయితే కృష్ణ సినిమాలు రీమేక్ చేయరు. ఆయన పాటలు రీమిక్స్ చేయరు. కనీసం డైలాగ్స్ చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఈ విధంగా తండ్రిని ఇమిటేట్ చేసే ప్రయత్నం మహేష్ ఎప్పుడూ చేయలేదు. కానీ బ్లడ్ ఎక్కడికి పోతుంది. నటన, స్టైల్ బాడీలోనే మిళితం అయిపోయి ఉంటుంది. అది మనకి తెలియకుండానే బయటికి వస్తుంది. అలాంటి సంఘటన మహేష్ విషయంలో జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ ఓత్ ని రిలీజ్ చేశారు. వీడియో లేకుండా కేవలం ఆడియో మాత్రమే విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న ఈ ఆడియో విన్నప్పుడు చాలా మందికి కృష్ణ గుర్తుకు వచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో దేశం కోసం కృష్ణ డైలాగ్స్ చెప్పే సమయంలో అనిపించే భావన మహేష్ గొంతులోను కనిపించింది. ఆ టోన్ ఇప్పుడు ఈ డైలాగ్ విషయంలో మ్యాచ్ అయిందని సినీ విశ్లేషకులు వెల్లడించారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.