సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు.గత 3 నెలల్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించారు.సెప్టెంబర్ 11న ప్రభాస్ పెదనాన్న గారు అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. అలాగే రష్మీ జయ గోపాల్, కమెడియన్ రాజు శ్రీవాస్తవ్, బెలూన్ ఆర్టిస్ట్ కమ్ నటుడు అయిన శరవణ ధన్‌పాల్ వంటి వారు మరణించడం జరిగింది.
తాజాగా మరో దర్శకుడు మృతి చెందడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే… మళయాళ దర్శకుడు అశోకన్ అలియాస్ రామన్ అశోక్ కుమార్ అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈయన వయసు 60 సంవత్సరాలు. కొన్నాళ్లుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆదివారం నాడు కన్నుమూశారు.
ఈయన మరణ వార్త విని మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఈయన ఎక్కువగా కామెడీ చిత్రాలను తెరకెక్కించారు.అందులో కొన్ని హిట్ అవ్వడంతో ఈయనకు మంచి పేరు లభించింది. ఈయన తొలి చిత్రం వర్ణం. ఇక అశోకన్ మరణానికి చింతిస్తూ పలువురు మళయాళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.