మోహన్ బాబు (Mohan Babu) కుటుంబానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. కుటుంబంలో పెరిగిన విభేదాలు ఇప్పుడు బయటికి రావడం, పోలీసు స్టేషన్‌లకు వెళ్లడం, మీడియాపై దాడి వంటి సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) మీడియా ముందుకు వచ్చి తన మనసులోని బాధలను పంచుకున్నారు. మంచు మనోజ్ మాట్లాడుతూ, “మా నాన్న దేవుడు. నాకు ఆయన లాంటి ప్రేరణ ఎవ్వరు ఉండరు.
Manchu Manoj
కానీ, ఈరోజు కనిపిస్తున్న మా నాన్న నా దేవుడు కాదనిపిస్తోంది. మా కుటుంబంలో జరిగిన ఈ గొడవలు అందరికి బాధ కలిగించాయి. నా భార్య 7 నెలల గర్భిణీగా ఉన్నప్పుడే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని చాలా అనవసరమైన ప్రచారం జరుగుతోంది. నేను ఎప్పుడూ ఆస్తుల కోసం ఎవ్వరిని అడగలేదు. నా భార్య, కూతురి పేరు ఈ గొడవల్లో లాగడం బాధ కలిగిస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, “నాన్నగారికి కొందరు లేనిపోని విషయాలు చెప్పి మనసు మార్చారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా జీవిత నిర్ణయం. కానీ ఈ విషయంలో మా నాన్నతో విభేదాలు రావడం జరిగింది. నా భార్య, నా కూతురు కోసమే ఈ పోరాటం. నేను నా జీవితాన్ని నా సొంత కాళ్ల మీద నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నా. మీడియాపై మా కుటుంబం దాడి చేయడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెబుతున్నా,” అన్నారు.
ప్రస్తుత పరిణామాలపై మరిన్ని విషయాలు వెల్లడించడానికి సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు మనోజ్ తెలిపారు. తన భావోద్వేగ ప్రకటనతో కుటుంబంలో విభేదాలు ఎంత దూరం వెళ్లాయో అర్థమైంది. ఇక మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి, కుటుంబం లోపల జరుగుతున్న పరిణామాలపై పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. అభిమానులు ఈ వివాదం త్వరగా పరిష్కారమవాలని ఆకాంక్షిస్తున్నారు. మోహన్ బాబు కుటుంబం మరోసారి ఏకతాటిపైకి రావాలని కూడా కోరుకుంటున్నారు.