తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మరో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ పలు సంచలన కామెంట్లు చేశారు. విష్ణు మాట్లాడుతూ.. “ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాలు మాకు అందలేదు. అవి నాకు అందిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. ఇక ఆదివారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో నేను, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నాం. మా ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది అది మీకు తెలుసు.
చిరంజీవి గారి వల్ల ఆ సాన్నిహిత్యం మొదటి నుండీ ఉంది. ఇక నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన, నేను మాట్లాడుకున్నాం. నేను ఆయన్ని ఓ ప్రశ్న కూడా అడిగాను. అది ఏమిటి అన్నది తర్వాత తర్వాత చెబుతాము. అయితే ఆయన ‘ఇది మన తల్లి… జాగ్రత్తగా చూసుకో విష్ణు’ అని నాతో చెప్పారు. ఆ సందర్భంలో మేము భారత ఉప రాష్ట్రపతి సమక్షంలో ఉన్నాం కనుక మేము ప్రోటోకాల్ పాటించి ఎక్కువ సేపు మాట్లాడుకోలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గారు పోటీ చేయొచ్చు.అందుకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు.
తెలుగు వాళ్ళు మాత్రమే ‘మా’ అధ్యక్షుడి పదవికి పోటీ చేయాలని మేము ఎక్కడా చెప్పలేదు. ఎన్నికల తర్వాత కూడా చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఓ జర్నలిస్ట్ ఒక డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యాడు. అతని వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాయి. అలాంటి వ్యక్తుల కోసం పద్ధతుల్ని మార్చాలి అని కూడా నేను డిసైడ్ అయ్యాను. అలాంటి విషయాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను” అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.