‘మన్మథుడు’ సినిమా చూశారా? నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటే ఈ సినిమా అనే చెప్పొచ్చు. ఆ సినిమాలో కామెడీ, నాగార్జున యాక్టింగ్, టైమింగ్, లుక్, స్క్రీన్‌ప్రజెన్స్ ఇలా అన్నీ అదిరిపోతాయి. అందుకే సినిమా వచ్చి 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా పేరు వింటేనే చాలు సగటు టాలీవుడ్ అభిమాని ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా సూరిబాబు లవంగంగా బ్రహ్మానందం ఎపిసోడ్ అదిరిపోతుంది.
ఇప్పుడు ‘మన్మథుడు’ సినిమా గురించి, లవంగం టాపిక్ గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది. ఎందుకంటే సూరిబాబు లవంగం ఎపిసోడ్‌లో కీలకమైన, సినిమా క్లైమాక్స్‌కు డ్రైవింగ్ పాయింట్ అయిన కళ్లు మూసుకుని బ్రిడ్జి దాటే సన్నివేశం గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ అంతా. కావాలంటే మీరు ఒకసారి ట్విటర్ అలియాస్ ఎక్స్‌లో మన్మథుడు అని ఓసారి సెర్చ్ చేసి చూడండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది.
‘మన్మథుడు’ సినిమాలోని పారిస్‌కు బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తారు హీరో నాగార్జున, హీరోయిన్ సోనాలీ బింద్రే. ఈ క్రమంలో అక్కడ వాళ్లకు అసిస్ట్ చేయడానికి బ్రహ్మానందం వస్తారు. బిజినెస్ ట్రిప్‌తో పాటు అలా సైట్ సీయింగ్ కోసం పారిస్ చూపించే ప్రయత్నం చేస్తాడు. అలా ఓ నది పాయ మీద బ్రిడ్జ్ దాటే సీన్ వస్తుంది. అప్పుడు నాగార్జున తనకు నీళ్లంటే భయమని, దాటనని చెబుతారు గుర్తుందా? ఆ సీన్ గురించే ఇప్పుడు చర్చ.
ఆ సీన్‌లో చూపించిన బ్రిడ్జి అసలు పారిస్‌లో లేదట. ఆ సీన్‌ను ఆస్ట్రియాలో తీశారట. సినిమాలో మాత్రం ఆ బ్రిడ్జి పారిస్‌లో ఉందనేలా చూపించారు. ఈ విషయాన్ని చెబుతూ ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. దీంతో 21 ఏళ్ల క్రితం ఆస్ట్రియాను ప్యారిస్ అని చెప్పి మోసం చేశారు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే గతంలో చాలా సినిమాల్లో ఇలానే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే.