శ్రీకాంత్, అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మెంటల్’. కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతాను. రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరూ నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. ఆగస్టు 12న సినిమా విడుదలవుతుంది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కోర్టు కేసు అయ్యింది. ఇప్పుడు సినిమా ‘మెంటల్’ అనే టైటిల్‌తో విడుదలవుతుంది. పోలీసులు గర్వంగా ఫీలయ్యే సినిమా. అలాగే నేను నెగటివ్ రోల్స్ లో చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. నన్నెవరూ ఆలాంటి పాత్రలకు సంప్రదించలేదు. భవిష్యత్‌లో ఎవరైనా సంప్రదించి, నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఇక మా అబ్బాయి నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం విడుదల నిర్మాత నాగార్జునగారి చేతుల్లో ఉంది. బహుశా వచ్చే నెలలో ఉండవచ్చునని అనుకుంటున్నాను..అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జీ మాట్లాడుతూ…టైటిల్ కోర్టులో ఉండటం వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ ను మెంటల్ గా మార్చాము. ఇందులో శ్రీకాంత్‌గారు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతారు. చచ్చినా, బ్రతికినా పోలీస్‌గానే బ్రతకాలనే పాత్రలో శ్రీకాంత్‌గారు అద్భుతంగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆగస్టు 12న సినిమా విడుదల అవుతుంది.. అన్నారు.
శ్రీకాంత్ సరసన అక్ష నటించిన ఈ సినిమాలో సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలగు వారు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: కోటగిరి, ఫైట్స్: రవి, కెమెరా: బుజ్జి, నిర్మాతలు: వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కారణం బాబ్జి