మంచు వారి కుటుంబంలో జరుగుతున్న విషయాల్లో తప్పెవరిది, ఒప్పెవరిది అనేది చెప్పడం అంత సులభం కాదు కానీ.. తాజాగా మోహన్‌బాబు (Mohan Babu) విడుదల చేసిన వాయిస్ నోట్ మాత్రం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. ఇన్నాళ్లుగా మనోజ్ (Manchu Manoj) చెబుతున్న కొన్ని విషయాలు, వ్యక్తం చేస్తున్న అనుమానాల గురించి ఆ వాయిస్ నోట్‌లో మోహన్‌బాబు కొంత చెప్పారు. మోహన్‌బాబు ఇంటి దగ్గర రాత్రి హైడ్రామా చోటు చేసుకున్నాక మోహన్‌బాబు ఓ ఆడియో మెసేజ్ మీడియాకు పంపించారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
Mohan Babu
మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) , విష్ణువర్ధన్ బాబు(Manchu Vishnu), మనోజ్ కుమార్ .. మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే (మనోజ్) గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. కానీ నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. అయినా నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి అని చెప్పుకొచ్చారు.
జల్‌పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం, నీకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్లి అయిన తర్వాత నువ్వు మద్యానికి బానిసగా మారావు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగావు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. ఇప్పటివరకు నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా? నా ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా? దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం అని అన్నారు. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు (మనోజ్) అధికారం లేదు.
నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. గతంలో ఓసారి తప్పు చేసి, మళ్లీ చేయనని చెప్పి ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు మళ్లీ చేస్తున్నావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటారు. అయితే అది షూటింగ్‌ల్లో తప్ప ఇంట్లో కాదు. నువ్వు వచ్చి తన బిడ్డను తీసుకెళ్లొచ్చు. రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతా. ఆసుపత్రి నుండి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమక్షంలో నీకు అప్పగించమని చెబుతాను. ఇక చాలు ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని వాయిస్ నోట్ చెప్పారు మోహన్‌బాబు.