బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేసిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించిన సినిమా టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక పాత భవనం చూసే ఉంటారు. ఆ పాత భవనం వెనుకాల కథని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వివరించారు. “దర్శకుడు అశోక్ చెప్పిన కథ ప్రకారం. ఐదు వందల ఏళ్ళ క్రితంనాటి ఓ పురాతన భవనం కావల్సివచ్చింది. ఓ రాజు.. తన భార్యకు కానుకగా ఇచ్చిన భవంతి అది. అలాంటి భవంతి కోసం వెతికాం. మాకు కావల్సినట్టుగా బంగ్లా ఎక్కడా కనిపించలేదు. దాంతో సెట్ వేయాలని డిసైడ్ అయ్యాం. కొన్ని స్కెచ్చులు వేశాం. చివరికి 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ సెట్‌ని నిర్మించాం. అదే.. ‘భాగమతి బంగ్లా’.” అని వివరించారు. ఈ బంగ్లాలోని విశేషాల గురించి మాట్లాడుతూ.. ” 12 గదులున్న రెండు అంతస్థుల భవనం ఇది.
ఆ రోజుల్లోనే లిఫ్ట్ సౌకర్యం ఉండేది. అయితే లిఫ్ట్‌ని మనుషులు తాళ్లతో లాగేవారు. వాటికి తగ్గట్టుగా ఓ లిఫ్ట్‌నీ రూపొందించాం. ఫైబర్‌ని ఎక్కువగా వాడాం. రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రాజుల నాటి ఫొటోల్ని పెద్ద పెద్ద ఫ్రేముల్లో చూపించాం. ఒకొక్క ఫ్రేమూ పది అడుగులుంటుంది. మూడు కేజీల బరువు ఉంటుంది. ఇంత పెద్ద సెట్‌ని 200మంది కార్మికులు రాత్రి, పగలు పని చేసి 29 రోజుల్లో పూర్తి చేశాం. 3 కోట్లు ఖర్చు అయింది” అని రవీందర్ వివరించారు. తెరపైన ఈ బంగ్లా మరింత బాగుంటుందని తెలిపారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ఈ చిత్రం ఎల్లుండి (జనవరి 26వ తేదీన) రిలీజ్ కానుంది.