సొంత ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం ఎంటర్ అయ్యి… అక్కడ సరైన రిసెప్షన్ లేకపోయినా టాలీవుడ్‌కి వచ్చిన తర్వాత స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చూడని స్టార్ బజ్ పొందుతుంటారు ఆ నాయికలు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఎప్పుడో పదేళ్ల క్రితం మరాఠీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు అంటే సుమారు 10 ఏళ్ల తర్వాత మన దగ్గర స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె తెలుగులో తొలి సినిమా గురించి మాట్లాడింది.
‘సీతారామం’ సినిమా పేరు వినగానే సినీప్రియుల మదిలో మెదిలే అందమైన రూపాలు రెండు. ఒకటి సీతగా చెరగని ముద్ర వేసిన మృణాల్ ఠాకూర్ కాగా, రెండోది అఫ్రీన్‌గా ఆకట్టుకున్న రష్మిక మందన. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఫ్రీన్ గురించి సీత మాట్లాడింది. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృత్తిగతంగా రష్మిక, దుల్కర్‌లను స్ఫూర్తిగా తీసుకుంటానని మృణాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘సీతారామం’ సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అందులో తనతో నటించిన రష్మిక, దుల్కర్ సల్మాన్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్పింది మృణాల్. సినిమాలు, కథల ఎంపికలో ఎంపికలో రష్మిక చాలా స్పెషల్‌గా ఉంటుందన్న మృణాల్… అఫ్రీన్ పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పింది. సెట్‌లో ఎన్ని గంటలు పని చేసినా ఆమెలో (Rashmika) అలసటే కనిపించేది కాదు అని మెచ్చుకుంది.
ఇక దుల్కర్ సల్మాన్‌కు మంచి పాత్ర దొరికితే భాష ఏదైనా వెంటనే ఒప్పుకోవడం మనం చూసుంటాం. అది ఆయనకు సినిమా పట్ల అంకితభావానికి నిదర్శనం అని చెప్పింది. అందుకే తన జీవితంలో ఇద్దరినీ స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను ఎంచుకుంటున్నాను అని చెప్పింది మృణాల్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తోంది. ఇది కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అంటున్నారు. వాటిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఉందని టాక్.