అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ , మర్నా మీనన్ , రుక్సార్ ధిల్లాన్ , షబీర్ కల్లరక్కల్ ,నాసర్ , రావు రమేష్ (Cast)
విజయ్ బిన్ని (Director)
శ్రీనివాస చిట్టూరి (Producer)
ఎంఎం కీరవాణి (Music)
దాశరధి శివేంద్ర (Cinematography)
Release Date : జనవరి 14, 2024
తనకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్ కి నాగార్జున అక్కినేని ఈసారి “నా సామిరంగ” అంటూ వచ్చారు. మలయాళ చిత్రం “పొరింజు మరియమ్ జోస్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అల్లరి నరేష్, ఆషికా రంగనాధ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: తమ్ముడు లాంటి అంజి (నరేష్), తండ్రి లాంటి ఊరిపెద్ద (నాజర్)కి అండగా నిలిచిన మొనగాడు కిష్టయ్య (నాగార్జున). సొంత కొడుకులైన తమకంటే కిష్టయ్యకే ఎక్కువ విలువ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతారు దాసు (షబ్బీర్) అండ్ బ్రదర్స్. ఈ అంతర్యుద్ధం తారా స్థాయికి చేరుకొని చంపుకోవడాల వరకూ వెళ్తుంది. ఈ కథలో వరాలు (ఆషికా రంగనాధ్) పాత్ర ఏమిటి? తన ప్రత్యర్ధులను కిష్టయ్య ఎలా ఎదిరించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “నా సామిరంగ”.
నటీనటుల పనితీరు: గోదావరి యాసలో నాగార్జున నటన & పంచెకట్టులో ఆయన స్క్రీన్ ప్రెజన్స్ ప్రతిసారీ భలే హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో ఆయన సరికొత్తగా రగ్గడ్ లుక్ లో నాటుగా కనిపించి మాస్ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకున్నాడు. నిజానికి ఆషికా రంగనాధ్ ఈ చిత్రంలో నాగార్జున పక్కన సూట్ అవ్వలేదు కానీ.. ఆమె హుందాగా వయసుకు మించిన పాత్రలో ఒదిగిపోయింది. ఆమె గ్లామర్ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
నరేష్ మరోసారి తనదైన శైలిలో అలరించాడు. నవ్వించి, ఏడిపించే ప్రయత్నం కూడా చేశాడు. రాజ్ తరుణ్ పాత్ర పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. రుక్సార్, మిర్ణాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తమిళ నటుడు షబ్బీర్ విలనిజం అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా అతడి క్యారెక్టరైజేషన్ ను బాగా ఎలివేట్ చేసుకున్నాడు. తెలుగులో పెద్ద విలన్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: కీరవాణి నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. ప్రతి ఎమోషన్ & సెంటిమెంట్ ను చాలా చక్కగా ఎలివేట్ చేశారు కీరవాణి. పాటలు కూడా సందర్భానుసారంగా బాగున్నాయి. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. మాస్ సీన్స్ ను బాగా తీశాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కంటెంట్ కు తగ్గ క్వాలిటీ వర్క్ ఇచ్చారు.
దర్శకుడు విజయ్ బిన్నీ.. కొరియోగ్రాఫర్ కావడం వలన సీన్ కాంపొజీషన్స్ బాగా చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా తెరకెక్కించాడు. ఇక అల్లరి నరేష్ మెయిన్ యూఎస్పీ అయిన కామెడీని కూడా బాగా ఉపయోగించుకున్నాడు. అల్లరి నరేష్ శోభనం సీన్ & ఆషికా రంగనాధ్ ను థియేటర్ కి తీసుకెళ్లే సీన్ బాగా వర్కవుటయ్యాయి. కథకుడిగా-దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు విజయ్ బిన్నీ.
విశ్లేషణ: పండగ వాతావరణంతోపాటు రూరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, కామెడీ & యాక్షన్ పుష్కలంగా ఉన్న సినిమా “నా సామిరంగ”. ఈ పండక్కి “హనుమాన్” తర్వాత సెకండ్ ఆప్షన్ గా ఈ చిత్రం నిలుస్తుంది. “ఘోస్ట్” లాంటి డిజాస్టర్ అనంతరం నాగార్జున “నా సామిరంగ” (Naa Saami Ranga) అంటూ పండగ హిట్ కొట్టేశాడనే చెప్పాలి.