Naga Vamsi: నాగవంశీ సూపర్ లైనప్.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?
- January 3, 2026 / 11:10 PM ISTByFilmy Focus Desk
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద గత కొన్ని ఏళ్లుగా సినిమాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఫలితాలు, వసూళ్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు నిర్మాత నాగవంశీ. మరో రెండు బ్యానర్లతో కలసి ఆయన ఈ సినిమాలు చేస్తున్నా.. కీలకం ఆయనే. ఇటీవల ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలు ఇంకెవరికీ తగలలేదు అంటే అతిశయోక్తి లేదు. ఇంత జరుగుతున్నా ఆయన సినిమా నిర్మాణం ఆగడం లేదు. ఎందుకంటే సుమారు 40 సినిమాలకు వచ్చేసింది కౌంట్. ఇక 2026లో అయితే ఏడాదంతా సినిమాల పనులతో బిజీ అయిపోనున్నారాయన.
Naga Vamsi
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ తన లైనప్ గురించి చెప్పారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతికి రానున్న నాగవంశీ.. చేతిలో వరుస ప్రాజెక్టులు ఓకేగా ఉన్నాయి. వాటి అనౌన్స్‌మెంట్‌లు కొన్ని ఇప్పటికే రాగా.. మరికొన్ని మరికొన్ని రోజుల్లో రానున్నాయి. రోషన్ మేక హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘హిట్’ సినిమాలు తప్ప హిట్ లేని శైలేషన్ ఎలాంటి కథతో వస్తారో చూడాలి. ‘అనగనగా’ ఫేమ్ సన్నీ సంజయ్ డైరక్షన్‌లో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా ఉండనుంది.

‘మ్యాడ్’ సినిమా దర్శకుడు కల్యాణ్ శంకర్ ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నారట. ఆ హీరో రవితేజ అని సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ, స్వరూప్ ఆర్.ఎస్.జే కాంబినేషన్‌లో ఓ వినోదాత్మక చిత్రం ఓకే ఐయింది. ‘మ్యాజిక్’ సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్ తిన్ననూరి మరో సినిమా కూడా సితారలో చేయనున్నారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి ఓ సినిమా చేస్తున్నారు ఇదే బ్యానర్‌లో. దాని తర్వాత కూడా వెంకీ అట్లూరి ఇదే బ్యానర్‌లో సినిమా చేస్తారట.
‘మ్యాడ్ 2’కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ జూనియర్స్’ అని ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా 2026 సెకండాఫ్‌లో విడుదలవుతుందట. ఇలా వరుస సినిమాలతో నాగవంశీ కొబ్బరికాయలు, గుమ్మడికాయలతో 2026ని ముగిస్తారు. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్‌తో ఓ సినిమాను చేయాలని నాగవంశీ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తారు. మరోవైపు ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను ఇక్కడకు తీసుకొచ్చి రిలీజ్ నిర్మాత కూడా అవుతుంటారాయన.

















