టాలీవుడ్ లో ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లపై కరోనా ఎఫెక్ట్ పడడంతో మేకర్లు, హీరోలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటివరకు యంగ్ హీరోల సినిమాలను మాత్రమే ఓటీటీలో చూశాం. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సినిమా కూడా ఓటీటీలో చూసే అవకాశముంది. ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా తన ఆలోచనలు మార్చుకొని ఓటీటీ రిలీజ్ కి అంగీకరించినట్లు సమాచారం.
థియేటర్లు పునః ప్రారంభం అవుతున్నప్పటికీ అవి సాధారణ స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో తెలియడం లేదు. పైగా చాలా సినిమాలు థియేట్రికల్రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా వడ్డీల భారాన్ని మోస్తూ పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయా అని చూస్తున్నాయి. థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచినప్పుడు రిలీజ్ కోసం కొట్లాటలు తప్పవు. ఈ ఏడాది వేసవి సమయం నుండి ఎదురుచూస్తున్న సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి నిర్మాత కౌన్సిల్ అవకాశాలు కల్పిస్తుంది.
ఆ లెక్కన చూసుకుంటే ఈ మధ్య పూర్తయిన సినిమాలు వెనక్కి వెళ్లక తప్పదు. పండగ, వేసవికి కూడా ఛాన్స్ దొరుకుతుందని ఆశించలేం. ఎందుకంటే పెద్ద సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ‘వైల్డ్ డాగ్’ను ఓటీటీలో రిలీజ్ చేయాలని నాగ్ నిర్ణయించుకున్నారట. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఫాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ డీల్ ని ఫైనల్ చేసుకొని త్వరలోనే డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటించాలని చూస్తున్నారు.