ఒకప్పుడు నంది అవార్డులు అంటే.. అదో గొప్ప ఆనందం. ఆ ఆనందానికి తెలుగు సినిమా నోచుకోక చాలా ఏళ్లు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిపోయాక.. తెలుగు సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే అవార్డులు అప్పుడప్పుడు ఇస్తారు అనే చెడ్డ పేరు సంపాదించుకున్న ప్రభుత్వాలు.. రాష్ట్రవిభజన తర్వాత పెద్దగా పట్టించుకోక ఆ పేరును నిజం చేశాయి. అయితే తెలంగాణలో ప్రభుత్వం గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరోసారి ఏపీలో నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది.
దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చినా.. ఆ తర్వాత అవార్డుల గురించి పెద్దగా ఎక్కడా స్పందన లేదు. అయితే ఇప్పుడు అవార్డుల గురించి ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడారు. దీంతో ఈ విషయంలో కదలిక వచ్చిందని చెప్పొచ్చు. వచ్చే ఉగాదికి నంది అవార్డుల వేడుక నిర్వహించాలి అనుకుంటున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. దీంతో పాటుగా నంది నాటకోత్సవాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.
అయితే ఇక్కడే ఒకటే డౌట్. ఉగాదికి నంది అవార్డులు ఇవ్వాలంటే ఇప్పటి నుండే అవార్డుల ఎంపిక కోసం పనులు మొదలుపెట్టాలి. ఇందుకోసం జ్యూరీలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దుర్గేశ్ ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి.. ఆ జ్యూరీల పని కూడా మొదలవుతుంది అనుకోవాలి. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పొచ్చు. అయితే నంది అవార్డులను ఆఖరిగా 2016లో ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి మొత్తం సంవత్సరాలకు ఇస్తారా? లేక గత సంవత్సరానికే ఇస్తారనేది చూడాలి.
తెలంగాణలో అయితే గతేడాదికిగాను మొత్తం అన్ని విభాగాల్లో గద్దర్ అవార్డులు ఇచ్చి.. ఆ ముందుటి సంవత్సరాలకు ఉత్తమ చిత్రాలకు పురస్కారాలు అందించారు. దీంతో అన్ని సంవత్సరాలు కవర్ చేసినట్లయింది. ఈ విషయంలో తేలాలి అంటే జ్యూరీ కమిటీలు, డేట్స్ బయటకు రావాలి.
