రెండేళ్ల క్రితం టీజర్‌తో అనౌన్స్‌మెంట్.. కొన్ని రోజుల క్రితం ట్రైలర్‌తో క్లారిటీ.. ఇప్పుడు స్పెషల్ డే నాడు రిలీజ్. ఇదీ నయనతార (Nayanthara) జీవితం ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ ప్రస్థానం. నిజానికి ఈ డాక్యుమెంటరీ గురించి చర్చ సాఫ్ట్‌గానే సాగుతూ ఉంది. అయితే ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమాలోని ఓ వీడియో బిట్ వాడటానికి ధనుష్ (Dhanush) రూ. 10 కోట్లు అడిగాడు అంటూ నయనతార ఆరోపిచండంతో ఒక్కసారిగా ఫెయిరీ టేల్ మీద అందరి చూపు పడింది.
Nayanthara Beyond The Fairy Tale
ఇప్పుడు డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ డాక్యుమెంటరీ ఎలా ఉంది? నయనతార గురించి ఏం చెప్పారు? ఏం చూపించారు? ఆమె గతంలోని చేదు విషయాలను కూడా ప్రస్తావించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్. అంతేకాదు ఇంత ఇష్యూ క్రియేట్ చేసి బజ్‌ను తీసుకొచ్చిన ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమాలోని సన్నివేశాలను డాక్యుమెంటరీలో చూపించారా అనే వివరాలు ఇవీ.
‘నయనతార’ జీవితాన్ని ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ. నయనతార కుటుంబాన్ని, చిన్నతనంలోని ఫొటోలతో మొదలుపెట్టారు. జువెలరీ షాప్ ప్రకటన చూసి తనకు సినిమా ఛాన్స్ వచ్చిన విషయం ఆమెతో చెప్పించారు. అంతకుముందు ఆమెకు అసలు సినిమాలే నచ్చని విషయం కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆమెతో కలసి పని చేసిన దర్శకుల వాయిస్‌లు కూడా వినిపించారు.
నటిగా ఎంటర్ అయిన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను నయన్ షేర్ చేసుకుంది. ‘గజినీ’ సినిమా సమయంలో తనను బాడీ షేమింగ్ చేసినట్లు ఆమె చెప్పింది. అయితే ‘బిల్లా’ సినిమా కోసం బికినీ వేసుకుని ఆ విమర్శలకు సమాధానం ఇచ్చాను అని చెప్పింది. తన జీవితంలో రిలేషన్స్ గురించి కూడా పేర్లు లేకుండా చెప్పుకొచ్చింది నయన్. అయితే ప్రజలు వాళ్లకు నచ్చినట్లు ఊహించుకున్నారు అని కూడా అంది.
నటీమణులు మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు.. వాళ్లు మాత్రమే ప్రేమిస్తున్నట్లు అనుకుంటూ ఉంటారు జనాలు అని కాస్త ఘాటుగానే ఇటు జనాలను, అటు మీడియాను ఉద్దేశించి మాట్లాడింది నయన్. అయితే రిలేషన్ బ్రేకప్ తర్వాత తిరిగి ఎలా నార్మల్ అయింది అనే విషయం కూడా చెప్పింది. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున (Nagarjuna) ‘బాస్’ (Boss), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘శ్రీరామరాజ్యం’లో (Sri Rama Rajyam) అవకాశం వచ్చిందని తెలిపింది.
డాక్యుమెంటరీ సెకండాఫ్‌లో వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు చర్చకు వచ్చాయి. ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా సమయంలో ఇద్దరూ కలసిన విషయం, ఆ సమయంలో జరిగిన విషయాలను ఇద్దరి సంభాషణల తరహాలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ధనుష్, నయనతార మధ్య చర్చకు కారణమైన సినిమా సెట్‌లోని సన్నివేశాలను కూడా చూపించారు.
ఇక పెళ్లికి ముందు నయనతార – విఘ్నేష్ (Vignesh Shivan) మధ్య బంధం ఎలా ఉండేది, అనే వివరాలను కూడా డాక్యుమెంటరీలో చెప్పారు. సగటు భార్యాభర్తల్లాగే తమ లైఫ్ స్టైల్ ఉంటుందని ఇద్దరూ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే పెళ్లి జరిగిన విధానం, దాని కోసం ఎంత కష్టపడిన వివరాలు కూడా చెప్పారు. పెళ్లి కోసం ఆరు వేల మంది పని చేశారని క్లారిటీ ఇచ్చారు. అలాగే గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది అనే వివరాలు కూడా చెప్పారు.
అంతేకాదు పెళ్లి రోజున నయనతార ఎరుపు రంగు డిజైనర్ దుస్తులు ధరించడం వెనుక ఉన్న రీజన్‌ను కూడా చెప్పారు. అలాగే ఆ డ్రెస్ కోసం డిజైనర్‌లు పడిన శ్రమ గురించి వివరంగా చెప్పుకొచ్చింది నయన్. ఆఖరికిగా నయన్ దంపతుల పిల్లలు ఉలగమ్, ఉయుర్‌లను చూపించి డాక్యుమెంటరీ ముగించారు.
అయితే ధనుష్‌తో చర్చకు, లేఖల వరకు దారి తీసిన ఆ వీడియో ఫుటేజ్ ఈ డాక్యుమెంటరీలో ఉండటంతో చర్చ మళ్లీ మొదలైంది. ధనుష్ అడిగిన రూ. 10 కోట్లు ఇచ్చి నయన్ ఆ సీన్స్ తీసుకుందా అనే చర్చ నడుస్తోంది. లేదంటే ఇవ్వకుండా వాడేసి వాదించడానికే నిర్ణయం తీసుకుందా అని అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇప్పుడు ఆమెనే ఇవ్వాలి. ఎందుకంటే టాపిక్‌ను తొలుత బయటకు తీసుకొచ్చింది ఆమెనే కాబట్టి.