హీరోలు హీరోయిన్ విషయంలోనో లేక లొకేషన్ విషయంలోనో అడగడం చూసి ఉంటాం కానీ.. కథ విషయంలో అలగడం బహుశా మొదటిసారి జరుగుతుందేమో. ఎన్టీయార్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఓ భారీ స్థాయి సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేయడం.. ఇక ఆ వేడుకలో ఎన్టీయార్ కుటుంబ సమేతంగా రావడం, ఎన్టీయార్-పవన్ కళ్యాణ్ ల నడుమ మైత్రి చూసి వారి అభిమానులు విశేషంగా సంతోషించడం వంటి కారణంగా సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వడానికి ముందే సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక సినిమాలో ఎన్టీయార్ తనయుడు అభయ్ రామ్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలిసేసరికి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు త్రివిక్రమ్ పై ఎన్టీయార్ పై గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభమవ్వకముందే ఈ గుర్రు ఏంటా అని ఆరా తీయగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఎన్టీయార్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం తెలిసిందే. ఇటీవల మాటల సందర్భంలో త్రివిక్రమ్ తాను మహేష్ తో తీయబోయే సినిమా కథ చెప్పాడట. తన కోసం ప్రిపేర్ చేసిన ఫ్యామిలీ స్టోరీ కంటే మహేష్ కోసం సిద్ధం చేసిన కథే ఎక్కువగా నచ్చిందట ఎన్టీయార్ కి. అందుకే మహేష్ కోసం సిద్ధం చేసుకొన్న కథతో తన సినిమా తీయమని ఎన్టీయార్ పట్టుబట్టాడట. దాంతో.. ఇరకాటంలో పడ్డాడట త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ ఏదైనా ముందడుగు వేసి మహేష్ కోసం చేసిన కథను ఎన్టీయార్ హీరోగా రూపొందిస్తాడా లేక ఎన్టీయార్ ను కన్విన్స్ చేసి ముందు అనుకొన్న కథనే తెరకెక్కిస్తాడా అనే విషయం తెలియాల్సి ఉంది.