త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమాతో మళ్ళీ తానేమిటో నిరూపించుకున్నారు. అల వైకుంఠపురంలో సినిమా టేకింగ్ చూసిన అందరూ ముగ్దులై పోతున్నారు.కథకు తగ్గట్టుగా ఎమోషనల్ సన్నివేశాలు, సన్నివేశాలను ఎలివేట్ చేశేలా మైమరిపించే మాటలతో ప్రేక్షకులని కట్టిపడేశాడు. త్రివిక్రమ్ క్లాస్ పిక్టరైజేషన్ మాస్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యింది. నిజానికి కథలో పాంట్ మాత్రం త్రివిక్రమ్ ఎన్టీఆర్ చిత్రం నుండి అరువు తీసుకున్నారు. పేద తండ్రి తన కొడుకు శ్రీమంతుడిగా పెరగాలనే స్వార్థంతో అప్పుడే పుట్టిన పిల్లల్ని మార్చివేయడం అనేది.. ఎప్పుడో 1958లో వచ్చిన ‘ఇంటి గుట్టు’ సినిమాలోది. ఆ పాయింట్ కి త్రివిక్రమ్ తనదైన శైలిలో ట్రీట్మెంట్ అల్లి ఒక అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారు. కోర్ పాయింట్ తో పాటు ఈ రెండు చిత్రాలకు చాలా పోలికలే ఉన్నాయి.
ఏదైతేనేమి అల వైకుంఠపురంలో సూపర్ హిట్. కాబట్టి ఈ కాపీ వ్యవహారం అలా కొట్టుకుపోయింది. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా కోసం కూడా ఇలాగే పాత సినిమా కథకు మెరుగులు దిద్ది స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు ధ్రువీకరించాయి. కాబట్టి ఎన్టీఆర్ ఆయనతో చేయడం తథ్యం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో స్పూర్తితో 50-60ల కాలం నాటి ఫ్యామిలీ చిత్రాల కథలకు మెరుగులు దిద్ది తెరకెక్కిస్తే ప్రతి సారి ఫలితం రాకపోవచ్చు. అదీకాక త్రివిక్రమ్ ఒక సినిమా హిట్ ఐతే అదే స్పూర్తితో, ఆ ఛాయలు ఉండేలా తదుపరి చిత్రాలు తెరకెక్కిస్తారు. అత్తారింటికి దారేది మూవీ హ్యాంగ్ ఓవర్ నుండి ఆయన ఇంకా బయటికి రాలేదు. కాబట్టి ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ విషయంలో ఆయన అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఫాలో ఐపోవడం ఖాయం. కాబట్టి ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తపడకపోతే ప్రమాదమే.