స్టార్ మా ఛానల్ వాళ్లు ప్రసారం చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా సాగుతోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో 96 రోజులకు చేరింది. మరో వారంలో విజేత ఎవరో తెలిసిపోనుంది. ఇంకొంచెం మసాలా.. అనే ట్యాగ్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 షో లో రొమాన్స్, గొడవలు.. కన్నీళ్లు.. ఇలా అన్ని ఎమోషన్స్ తెలుగు టీవీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ షో వల్ల వినోదం కంటే వివాదమే ఎక్కువగా ఉందని, విజ్ఞానం అసలు లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ షో పై న్యాయవాది కేసు కూడా వేశారు. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. “బిగ్ బాస్ 2 లో జరిగి కొన్ని సంఘటనలను నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
ఈ షోలో పెట్టే పలు గేమ్ షో లు దారుణంగా ఉంటున్నాయి. మగవాళ్లకు, ఆడవాళ్లకు ఒకేలా పోటీలు పెట్టడం దారుణం. మగవాళ్లకు ఉన్న బలం ఆడవాళ్లకు ఉంటుందా?” అని ప్రశ్నించారు. “ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను కార్ లో పెట్టి .. ఇద్దరు మహిళలను బయటికి నెట్టే ప్రయత్నం చేయడం… అసలు బాగాలేదు. బలవంతులు బలహీనులపై గెలవడం క్రీడా స్ఫూర్తి కాదు” అన్నారు. ఇలాంటి విషయాలు బిగ్ బాస్ టీమ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. పరుచూరి గోపాల కృష్ణ మాటల్లో వాస్తవం ఉందని నెటిజనులు మద్దతు తెలుపుతున్నారు.