‘దేవర’ (Devara) సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుంది అని గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశానికి తారక్‌కు (Jr NTR) అంతటి మంచి అనుబంధం ఇప్పుడు లేకపోవడమే. దీంతో ఈ సినిమా విషయంలో టీమ్‌ను ఇబ్బంది పెడతారేమో అని అనుకున్నారు ఇన్నాళ్లూ. కానీ సినిమా టీమ్‌కు ఆనందాన్నిస్తూ అన్ని రకాల వెసులుబాట్లు కలిపించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ‘దేవర’ టీమ్ థ్యాంక్స్ కూడా చెప్పింది.
Pawan Kalyan
దానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారికి రిప్లై ఇచ్చారు కూడా. దీంతో పాటు ‘దేవర’ సినిమా బృందానికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పకనే చెప్పారు. అలాగే గత ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటి కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో అప్పుడు, ఇప్పుడు అంటూ ఓ డిస్కషన్ మొదలైంది. తారక్ – కొరటాల (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొంది ‘దేవర’ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి, టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
తద్వారా టాలీవుడ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసిన విషయాన్ని స్పష్టంగా చూపించింది కూటమి ప్రభుత్వం. పంటకు తెగులు పట్టినట్లు గత ప్రభుత్వం తెలుగు సినిమా పట్టింది అనే విమర్శలు వచ్చాయి. పెద్ద సినిమా, అదనపు సౌకర్యాలు అవసరం ఉన్న సినిమాల విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.
దీంతో కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో అనే ప్రశ్నలకు తావు లేకుండా ‘దేవర’ కోసం అన్ని అవకాశాలూ ఇచ్చారు. తద్వారా తాము సినిమా పరిశ్రమకు ఎంత ప్రో అనేది చెప్పారు. ఆ లెక్కన ‘దేవర’ సాయం.. గత ప్రభుత్వ గాయానికి మందు అని కూడా అంటున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమాను కూటమి ప్రభుత్వం ఆదరించినట్లు అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు కూడా ఆదరిస్తారేమో.