‘పొన్నియన్ సెల్వన్’ తమిళ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 20 ఏళ్ల ముందే ఆయనకు ఈ సినిమా తీయాలనే ఆలోచన పుట్టింది. కల్కి కృష్ణమూర్తి అనే రచయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనే పేరుతో రాసిన ఓ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమానురూపొందించారు . ఈ కథ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి పార్ట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల కావడానికి ఆరు నెలల సమయం ఉండగా.. సెకండ్ పార్ట్ తో కలిపి ఈ సినిమాను డిజిటల్ డీల్ పూర్తి కావడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్.. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు భాగాలకు కలిపి ప్రైమ్ వాళ్లు రూ.125 కోట్లు చెల్లిస్తున్నారట. తమిళంలో ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అని తెలుస్తోంది.
క్యాస్టింగ్ పరంగా ఇదొక భారీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, విక్రమ్ ప్రభు, శోభిత దూళిపాళ్ల.. ఇలా చాలా మంది పేరున్న ఆర్టిస్ట్ లు ఈ సినిమాలో ఉన్నారు. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్‌తో కలిసి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డిజిటల్ హక్కులతోనే రూ.125 కోట్లు వచ్చాయంటే.. రెండు భాగాలకు కలిపి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ దర్శకుడు మణిరత్నంకి ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేదు. పైగా ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమాను కమర్షియల్ గా ఆయన తీయగలరా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ సినిమాకి ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి!