దేశంలో అతి పెద్ద స్టార్ హీరో ఇమేజీ ఉన్న హీరోల్లో ఇద్దరు కలసి నటిస్తున్న సినిమా అది. దేశంలోనే అత్యంత భారీ సినిమాలు, భారీ సినిమాల సిరీస్‌లు తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ హౌస్ అది. తెలుగు సినిమాల్లో అతి పెద్ద బ్యానర్ అనే పేరున్న బ్యానర్లలో ఒక బ్యానర్ ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతోంది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి అతి భారీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు తెరకెక్కించిన సినిమా అది. అన్నింటికి మించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న సినిమాకు సీక్వెల్ అది. ఇన్ని ‘భారీ’ అంశాలు ఉన్న ఆ సినిమా ప్రచారం మాత్రం ఏదో కొత్త హీరో సినిమా, చిన్న సినిమా హీరో సినిమా అనేలా ప్రచారం జరుపుకుంటోంది అంటే నమ్ముతారా?
పైన చెప్పిన ఉపోద్ఘాతమంతా ‘వార్ 2’ సినిమా గురించే అని మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. హృతిక్ రోషన్, తారక్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా చేస్తున్నారని సమాచారం. మొన్నీమధ్య తారక్, హృతిక్ కాంబినేషన్‌లో ఓ పాట చిత్రీకరించారని సమాచారం. అయితే సినిమా పనులు పూర్తవుతున్న స్థాయిలో సినిమా ప్రచారం జరగడం లేదు.
పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రచారం వారానికో పోస్ట్ అనేలా తయారైంది. ప్రతి వారం సోమవారం కానీ, మంగళవారం కానీ సినిమా టీమ్ నుండి ఎవరో ఒకరు మాట్లాడినట్లు, ఏదో చెప్పినట్లు ఓ ప్రెస్ నోట్ వస్తోంది. దీంతో సినిమా టీమ్ ప్రచార శైలి ఏంటి అనేది అర్థం కావడం లేదు. ‘సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. సినిమా టీమ్ నుండి చాలా నేర్చుకున్నా. సినిమా అద్భుతంగా ఉంటుంది. మీరు మరచిపోలేని అనుభూతి వస్తుంది’ లాంటి మాటలు తప్ప ఇంకేమీ ఉండటం లేదు.
‘బాహుబలి’ సినిమాలు, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప’ సినిమాల టీమ్‌లు తమ సినిమాను ఏ లెవల్‌లో ప్రచారం చేసుకున్నాయో చూశారు. అంతెందుకు ‘కన్నప్ప’ ప్రచారం శైలి కూడా చూశారు. కానీ ‘వార్ 2’ విషయంలో అవేవీ కనిపించడం లేదు. గట్టిగా చూస్తే నెల రోజులే ఉంది. మరోవైపు ఇద్దరు హీరోలు కలసి ప్రచారం చేయరు అంటున్నారు. ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటో అర్థమే కావడం లేదు. చూద్దాం సినిమా విడుదల దగ్గరకు వచ్చేసరికి ఏమన్నా ప్లాన్ మారుతుందేమో.