కొన్ని సినిమాల నిడివి ఎంత ఉన్నా.. థియేటర్లలో సీట్లకు అతుక్కుపోయి మరీ చూస్తుంటారు ప్రేక్షకులు. కాస్త అటు ఇటుగా ఉన్న సినిమాలకు రన్‌టైమ్ పెద్ద విషయం కానీ.. భారీ కాన్వాస్, పెద్ద కాస్టింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉంటే నిడివి పెద్ద విషయమే కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించడానికి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా వస్తోంది. అవును ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా నిడివి సుమారు మూడు గంటలట.
ప్రభాస్ – దీపిక పడుకొణె (Deepika Padukone) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – కమల్ హాసన్‌ల (Kamal Haasan) ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సెన్సార్ పూర్తైంది. యూ/ఏ సర్టిఫికెట్తో 2 గంటల 55 నిమిషాల రన్‌టైమ్‌తో సర్టిఫై చేసింది సెన్సార్ బృందం. ఇక సెన్సార్ టాక్ అంటూ కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాటిలో నిజమెంత, ఎవరు చెప్పారు అనేది తెలియదు కానీ.. సినిమాలో ఊహించని ట్విస్ట్లు, సస్పెన్స్లు ఉన్నాయట. అలాగే భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారట అనే రెగ్యులర్ పొగడ్త కూడా సెన్సార్ టాక్‌లో వినిపిస్తోంది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రచారాన్ని చాలా నెమ్మదిగా స్టార్ట్ చేసిన టీమ్.. ఇప్పుడు మౌత్ టాక్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది అని అర్థమవుతోంది. ‘బాహుబలి’(Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) రేంజిలో సినిమాకు ప్రచారం చేస్తారేమో అని అనుకున్నా.. ఇంకా ఒక వారం మాత్రమే ఉన్నా.. అలాంటి దాఖలాలు ఏవీ కనిపించడం లేదు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడమే దీని వెనుక ఉద్దేశం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ భారీ ఈవెంట్ ఉంటుంది అనేది ఓ టాక్.
సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది అని చెబుతున్న ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ మేరకు లైట్ ప్రచారం చేస్తున్న చిత్రబృందం బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తెలుగు మీడియాకు వీడియో బైట్‌లు రిలీజ్ చేస్తోంది. చూడాలి ఏపీ ప్రీరిలీజ్ ఈవెంట్‌తో అయినా బజ్ పెరుగుతుందేమో. అయినా ప్రభాస్ సినిమాకు ప్రచారం అవసరమా చెప్పండి అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.