అద్భుతమైన కథ.. కుర్చీలో కూర్చోబెట్టే కథనం… ఆశ్చర్యపరిచే విజువల్ ఎఫెక్ట్స్.. కళ్ళు రెప్పవేయని పోరాటసన్నివేశాలు.. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ , నాజర్ తదితరుల అమోఘమైన నటనకు తెలుగు వారు మాత్రమే కాకుండా అనేక దేశాల వారు జేజేలు పలికారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ గత ఏడాది రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లను వసూలు చేసింది. లెక్కలేనన్ని అవార్డులు, గౌరవాలు అందుకుంది. ఈ సినిమా జపాన్ లోను వందరోజులు ఆడి రికార్డు సృష్టించింది. చైనా లో మే 4 న 7000 స్క్రీన్లలో రిలీజ్ అయి సంచనాలకు తెరతీసింది.
తొలిరోజే సుమారు 2.85 మిలియన్ డాలర్లును కొల్లగొట్టి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న భారతీయ సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఈ కలక్షన్ల దూకుడు ఆగదని అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోయాయి. బాహుబలి బిగినింగ్ మాదిరిగానే ఈ చిత్రం చైనావాసులను ఆకట్టుకోలేకపోయింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డును బద్దలు కొడుతుందనుకుంటే రిలీజ్ కోసం పెట్టిన ఖర్చులు రాబట్టుకోవడానికి కూడా కష్టపడాల్సివస్తోంది. కనీసం 120కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తే ఇప్పటికీ 57 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. చైనా బాక్సాఫీస్ లెక్కన ఈ మూవీ ఫెయిల్ అయినట్టే లెక్క.