ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమాను ఓటీటీలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్నా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధర 1499 రూపాయలు కాగా తక్కువ సమయంలోనే సినిమాలు అందుబాటులోకి వస్తుండటంతో చాలామంది అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అయితే కేజీఎఫ్2 సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడాలని భావించే వాళ్లకు ప్రైమ్ నిర్వాహకులు భారీ షాకిచ్చారు.
ఈ సినిమా ఎర్లీ యాక్సెస్ కోసం 199 రూపాయలు చెల్లించాలని ప్రైమ్ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా ప్రైమ్ లో ఏదైనా సినిమాను ఎర్లీ యాక్సెస్ ద్వారా తీసుకుంటే నెలరోజుల పాటు చూసే అవకాశం ఉంటుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మాత్రం 199 రూపాయలు చెల్లించినా కేజీఎఫ్2 సినిమా చూడటం మొదలుపెట్టిన రెండురోజుల పాటు మాతమే చూసే ఛాన్స్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ట్విస్ట్ ను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని సబ్ స్క్రైబర్లు చెబుతున్నారు.
భారీ మొత్తం చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా లాభం లేదా? అంటూ మరి కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఉచితంగా కేజీఎఫ్2 ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ కేజీఎఫ్2 హక్కులను భారీ మొత్తనికి కొనుగోలు చేసిందని బోగట్టా. ఆ కారణం వల్లే ఈ సినిమాను రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను జీ5 ఓటీటీలో చూడాలన్నా అదనంగా 100 రూపాయలు చెల్లించాలనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నా పెద్దగా లాభం ఉండదని ఓటీటీ సంస్థలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాయి. నెలరోజుల క్రితం విడుదలైన సినిమాలకు రెంటల్ విధానం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.