ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. పుష్ప ది రూల్ మూవీ పుష్ప ది రైజ్ ను మించి ఉండాలనే ఆలోచనతో దర్శకుడు సుకుమార్ ఏకంగా ఎనిమిది నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. ఇప్పటికే పుష్ప ది రూల్ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా ఈ నెలలోనే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ మొదలుకావాల్సి ఉంది.
అయితే షూటింగ్ ల బంద్ ప్రభావం ఈ సినిమాపై కొంతమేర పడింది. పుష్ప ది రూల్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఈ నెల చివరి వారం నుంచి పుష్ప ది రూల్ షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నామని వెల్లడించారు. ఆగష్టు చివరి వారం లోపు బంద్ ముగియని పక్షంలో బంద్ పూర్తైన తర్వాత షూటింగ్ ను మొదలుపెడతామని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తాత్కాలికంగా షూటింగ్స్ నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ప్రొడ్యూసర్లు అంతా ఒకచోటుకు చేరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని రవిశంకర్ తెలిపారు. గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రస్తుతం 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కష్టమవుతోంది. సమస్యలను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య మరింత తగ్గే ఛాన్స్ అయితే ఉంది.
పుష్ప2 సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్లు ఏకంగా 200 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, ప్రాజెక్ట్ కె తర్వాత ఆ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని బోగట్టా. షూటింగ్ మొదలుకాకముందే పుష్ప ది రూల్ సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.