ప్రభాస్ (Prabhas) సినిమాల లైనప్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ త్వరలో స్వదేశానికి వస్తారు అని అంటున్నారు తప్ప.. ఎప్పుడు వస్తారు అని చెప్పడం లేదు. అయితే ప్రభాస్ గ్యాప్ వల్ల ప్రస్తుతం ఉన్న లైనప్ మారుతోంది అని. ‘స్పిరిట్’ (Spirit) సినిమా ఆఖరులోకి వెళ్లిపోతోంది అని ఓ వార్త సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ‘స్పిరిట్’ నిర్మాత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ – సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అధికారికంగా ప్రకటించి చాలా నెలలు అయింది. ‘యానిమల్’ (Animal) సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ గతేడాది ఆఖరులో సినిమా పనులు మొదలుపెడతాం అన్నారు. కానీ మొదలైన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అంటున్నారు.
అయితే ప్రభాస్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేవు. దీంతో ‘స్పిరిట్’ సినిమాను వరుసలో ఆఖరులో పెడతారు అని వార్తలొచ్చాయి. దీంతో ‘యానిమల్’ సినిమా సీక్వెల్ ‘యానిమల్’ పార్క్ ముందుకొస్తుంది అని పుకార్లు వచ్చాయి. అయితే అదేం లేదని నిర్మాత భూషణ్ కుమార్ (Bhushan Kumar) స్పష్టతనిచ్చారు. మరో రెండు, మూడు నెలల్లో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆ సినిమా తర్వాతే ‘యానిమల్ పార్క్’ను రూపొందిస్తారని తెలిపారు.
2027లో ‘స్పిరిట్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా చెప్పారు. అంటే ప్రభాస్ లైనప్‌లో మార్పులు లేనట్లే అని అంటున్నారు. కానీ ప్రభాస్ తిరిగి స్వదేశానికి వచ్చాక కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే ‘ది రాజాసాబ్’ (The Raja saab) విడుదల తర్వాత ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) రావొచ్చు. ఇంకా ఆయన లైనప్‌లో ‘కల్కి 2’(Kalki 2898 AD), ‘సలార్ 2’(Salaar) , ‘స్పిరిట్’ ఉన్నాయి. వీటిలో ప్రభాస్ ఏ సినిమాకు తొలుత డేట్స్ ఇస్తారో చూడాలి.