ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్, ఆయన అభిమానులకు ప్రముఖ నిర్మాత, దిల్ రాజు సోదరుడు శిరీష్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇటీవల ఓ ఇంటరవ్యూలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్‌పై శిరీష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చినికి చినికి గాలి వానగా మారడంతో శిరీష్ ఇప్పటికే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓ వీడియోను రిలీజ్ చేశారు.
రామ్ చరణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన్ను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదని శిరీష్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘‘మాకు, చిరంజీవి గారికి, రామ్‌చరణ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్‌చరణ్ ఒకరు. ఆయనను అవమానపరచాలనో, లేక కించపరచాలనో నేను అనుకోలేదు. నా జన్మలో ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదు. చేయను కూడా అని చెప్పారు శిరీష్.
ఇటీవల నేను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి నేను చిన్న మాట దొర్లినా అది తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి క్షమాపణలు చెబుతున్నాను. రామ్ చరణ్‌కు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఆయనతో నాకున్న అనుబంధాన్ని పాడు చేయదలుచుకోలేదు. నా గురించి వస్తున్న ట్రోలింగ్స్, వస్తున్న మాటలు నేను అర్థం చేసుకోగలను. ఒక హీరోను అలా అంటే ఎవరూ భరించలేరు. అయినా నా ఉద్దేశం అది కాదు. అక్కడ నా మాట దొర్లింది తప్ప నేను కావాలని అనలేదు అని శిరీష్ ఆ వీడియోలో చెప్పారు.
మాకు మెగా హీరోలందరితో మాకు మంచి అనుబంధం ఉంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్‌చరణ్‌తో రెండు సినిమాలు చేశాం. ఇలాంటి రిలేషన్ ఉన్న వాళ్లను అవమానించేంత మూర్ఖుడిని కాను అని శిరీష్ చెప్పారు. అయితే లేఖ రాసినా, మళ్లీ ఈ వీడియో అవసరం ఏంటి? ఎందుకు రెండు సారీలు అనేది ఇక్కడ పాయింట్.