తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గురువారం నాడు టాలీవుడ్ సినీ పెద్దలు భారీగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు, సంక్రాంతి సినిమాల నేపథ్యంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు తదితర అంశాలపై చర్చిస్తారని తొలుత వార్తలొచ్చినా.. అవేవీ చర్చించలేదు అని మీటింగ్ సమన్వయకర్త, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) చెప్పారు.
Suresh Babu
అయితే ఆ మీటింగ్ అయిన తర్వాత వివిధ టీవీ ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ టాలీవుడ్ వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందులో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు (D. Suresh Babu) కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ వ్యవహారం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు బన్నీ గురించే అని అంటున్నారు నెటిజన్లు. సంధ్య థియేటర్ ఘటన మనకు చాలా విషయాలు నేర్పుతుంది.
ఇలాంటివి జరగాలని ఎవరూ కోరుకోరు కానీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అన్నారు సురేశ్‌బాబు (Suresh Babu). పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచుల్లో కూడా తొక్కిసలాట ఘటనలు జరిగాయి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినిమా ఈవెంట్స్ ఇటీవల కాలంలో గ్రాండ్‌గా చేస్తున్నారని, సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారని పరిస్థితిని వివరించారాయన. ఈ క్రమంలో ఈవెంట్ గురించి లేదంటే కార్యక్రమం గురించి పబ్లిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా జనాలు విపరీతంగా వస్తున్నారని చెప్పారు.
వాళ్లని కంట్రోల్ చేయడం కష్టంగా మారిందని, ఈ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక రద్దీగా ఉన్న ప్రాంతాలకి పిల్లలతో వెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. అక్కడి వరకు ఓకే.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్ చెయ్, ఏమైనా చెయ్.. కానీ బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి. ఇవన్నీ ఇంట్లో చెప్పాలి అని సురేశ్‌బాబు అన్నారు. ఈ మాట ఎవరి కోసం అనేది ఆయనకు, ఆ మాటలు తగిలిన వాళ్లకు తెలుస్తుంది.