ప్రేక్షకుడు బంగారు బాతు లాంటోడు… మంచి సినిమాలు తీసి, ఆ విషయం అతనికి చెప్పి, ఒప్పించి టికెట్లు కొని థియేటర్లు రప్పించాలి. ఆ తర్వాత చెప్పిన స్థాయిలో అతన్ని మెప్పించాలి. అప్పుడే టికెట్ డబ్బులకు సరిపడా వినోదం తనకు వచ్చింది అని ప్రేక్షకుడు ఆనందపడతాడు. మరోసారి థియేటర్‌కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తాడు. అంతేకానీ సినిమా అంటే ఇష్టం ఉంది కదా అని ఎడాపెడా రేట్లు పెంచేసి.. బంగారు బాతు గుడ్డును ఇబ్బంది పెడితే… అసలుకే మోసం వస్తుంది.
ఈ పాటికే అర్థమైపోయుంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నాం. అందుబాటు ధరల్లో సినిమా అనే వినోదం ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవాడు. అయితే డబ్బు మీద ఆశ ఎక్కువయ్యో, ఇంకే కారణమో కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తెగ పెంచేశారు. స్పెషల్ షో అని, పర్మిషన్ అని, అదని ఇదని రకరకాల పేర్లతో ధరలు పెంచేశారు. ప్రేక్షకుడు ఆ డబ్బులు కట్టి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడలేక.. ఇంట్లోనే ఉండిపోయాడు.
దానికి తోడు సరైన సినిమాలు రాకపోవడం మరో కారణం. నాలుగు రోజులు ఓపిక పడితే ఓటీటీలోకి వచ్చేస్తుంది అనేది ఇంకో కారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతెందుకు మీరు కూడా టికెట్ ధరలు పెంపు వల్ల బాధపడేవాళ్లలో మీరూ ఉండే ఉంటారు. ఈ విషయం నిర్మాతలకు ఇటీవల బాగా అర్థమైంది. సినిమాలు విడుదలైన మూడు రోజులు కాకముందే థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీని వెనుక కారణాలు శోధించి, తమ వంతు ప్రయత్నం చేయాల్సిన నిర్మాతలు ఆ తప్పును ప్రేక్షకుల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు.
థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు కాబట్టే.. మేం సినిమాల నిర్మాణం ఆపేస్తామని నిర్మాతలు అంటున్నట్లు వార్తలొస్తున్నాయి. థియేటర్లకు వచ్చే జనాలను రెండు వారాలకే ఓటీటీల్లోకి సినిమా ఇచ్చేస్తాం. ఇక్కడ ఒక టికెట్‌కి పెట్టే డబ్బుతో ఇంటి మొత్తం చూసేయండి అని పెయిడ్ ప్రీమియర్లు పెట్టింది నిర్మాతలే. ఇంకొంతమంది అయితే సినిమా విడుదలైన వారం, పది రోజులకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.
పోనీ థియేటర్‌కి వెళ్దాం అంటే.. టికెట్ రేటు కంటే అక్కడ స్నాక్స్ రేటే ఎక్కువ ఉంది. ఈ విషయాల్ని పట్టించుకోకుండా జనాలకు థియేటర్లకు రారు అని ఓ అపవాదు వేస్తున్నారు. అయితే సినిమా నాణ్యత, విజయాల శాతం లాంటివి మాట్లాడటం వేస్ట్. గత ఏడెనిమిది నెలల్లో పాన్ ఇండియా సినిమాలు కాకుండా సాధారణ సినిమాల విజయాలు లెక్కెట్టాలంటే చేతిలో వేళ్లు ఇంకా మిగిలిపోతాయి. కాబట్టి పరనింద కాకుండా ఆత్మస్తుతి చూసుకుంటే సినిమా పరిశ్రమకు మంచిది.