‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడిన రోజు నుంచి ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడుతుందంటూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెప్పారు దర్శకనిర్మాతలు. రీసెంట్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ లో.. ఇది చాలా కఠినమైన సమయమంటూ రాసుకొచ్చారు. అది చూసిన ఫ్యాన్స్ సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా..? అంటూ ప్రశ్నించారు. దానికి స్పందించిన ఆయన అలాంటిదేమైనా ఉంటే అఫీషియల్ గా చెబుతామని అన్నారు.
ఆయన రిప్లై ఇచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరగడం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయడం తప్పలేదని చిత్ర యూనిట్ పేర్కొంది.’రాధేశ్యామ్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు గడిచిన కొన్నిరోజుల నుంచి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం’ అంటూ యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా ఇవ్వలేదు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడ్డాక కనీసం ‘రాధేశ్యామ్’ సినిమా సంక్రాంతికి వస్తుందనుకున్నారు. ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి లేకుండా పోయింది. కానీ పదుల సంఖ్యలో చిన్న సినిమాలు హడావిడి చేయబోతున్నాయి.