2018లో వచ్చిన “రెయిడ్” (Raid 2) చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. ఒక సిన్సియర్ సినిమాగా ఆ చిత్రాన్ని అందరూ ప్రశంసించారు. తెలుగులో ఆ సినిమాని “మిస్టర్ బచ్చన్”గా రీమేక్ కూడా చేసారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ను విడుదల చేసారు. “రెయిడ్ 2” టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తిని నెలకొల్పాయి. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: తన కెరీర్లో నిజాయితీగా, నిక్కచ్చిగా 73 రెయిడ్స్ చేపట్టిన అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగన్), 74వ రెయిడ్ టైంలో లంచం కేసులో ఇరుక్కుని 74వ సారి ట్రాన్స్ఫర్ చేయబడతాడు. ఆ ఊర్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న దాదా మనోహర్ భాయ్ (రితేష్ దేశ్ ముఖ్) బయటికి కనీపంచని విధంగా.. మంచితనం ముసుగులో ఏదో చేస్తున్నాడని గ్రహించి, తన 75వ రెయిడ్ ను చేపడతాడు.
అయితే.. బాబా ఇంట్లో కానీ, ఫౌండేషన్ లో కానీ, పార్టీ ఆఫీస్ లో కానీ దొంగసొమ్ము రూపాయి కూడా దొరకదు. ఆ కారణంగా సస్పెండ్ చేయబడతాడు అమయ్ పట్నాయక్.
అమయ్ వర్సెస్ దాదా మనోహర్ భాయ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఎవరు గెలిచారు? ఒకరిపై మరొకరు పైఎత్తులు వేసేందుకు ఎంతలా తపించారు? చివరికి ఎవరు ఎలా గెలిచారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “రెయిడ్ 2” (Raid 2) చిత్రం.
నటీనటుల పనితీరు: అజయ్ దేవగన్ తన రెగ్యులర్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. అతడి స్థాయి పాత్ర కాదు ఇది. “రెయిడ్”లో అజయ్ దేవగన్ పాత్రకు మంచి ఎమోషన్ & ఎలివేషన్ ఉంటుంది. అది సీక్వెల్లో మిస్ అయ్యిందనే చెప్పాలి.
రితేష్ దేశ్ ముఖ్ మాత్రం తన విలనిజంతో అందర్నీ డామినేట్ చేసిపడేశాడు. రెండు విభిన్నమైన షేడ్స్ ను పండించడంలో చాలా నేర్పు ప్రదర్శించాడు.
సౌరభ్ శుక్లా పాత్రను ప్రీక్వెల్ నుంచి కంటిన్యూ చేసిన విధానం బాగుంది. ఎప్పట్లానే ఆయన తన పాత్రకు 100% న్యాయం చేశాడు.
ఇక ఇలియానా స్థానంలో సెకండ్ పార్ట్ లో ఎంట్రీ ఇచ్చిన వాణికపూర్ సపోర్టింగ్ రోల్లో పర్వాలేదనిపించుకుంది.
అమిత్ సెయిల్,శృతి పాండే, బ్రిజేంద్ర కాలా తదితరులు తమ నటనతో స్క్రీన్ ప్లేకి ప్లస్ పాయింట్ గా నిలిచారు.
సాంకేతికవర్గం పనితీరు: ఈ తరహా సినిమాలకు ప్రొడక్షన్ & ఆర్ట్ టీమ్స్ పని ఎక్కువగా ఉంటుంది. డబ్బులు దాచే స్థలాలను క్రియేట్ చేయడం కానీ నోట్ల కట్టలను, బంగారాన్ని డూప్లికేట్ చేయడంలో కానీ చాలా జాగ్రత్త వ్యవహరించారు. అలాగే.. ఈ సినిమాలో సీజీ వర్క్ కి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అయితే.. అది మరీ అత్యుత్తమ స్థాయిలో లేదు కాని, పర్వాలేదనిపించుకుంది.
పాటలు అలరించకపోగా.. కథనానికి అడ్డంకిగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. మెయిన్ కలర్ టోన్ & డి.ఐ మైంటైన్ చేసిన విధానం బాగుంది.
దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ప్రత్యేకత ఏంటంటే.. కథ-కథనం చాలా సహజంగా ఉంటాయి. అనవసరమైన ఎలివేషన్స్ ఉండవు. “రెయిడ్ 2”లోను ఆ ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. అయితే.. మొదటి పార్ట్ ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండ్ పార్ట్ లేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ముఖ్యంగా.. సెకండాఫ్ లో అజయ్ దేవగన్ చేసే పోరాటం చాలా సింపుల్ గా ఉంటుంది. కేంద్రస్థాయిలో పలుకుబడి ఉన్న ఓ మంత్రిని టార్గెట్ చేసి అతడి పతనాన్ని చూడడం ఇంత సింపులా అన్నట్లుగా ఉంటుంది. ఈ డ్రామా విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఈ లోపాల కారణంగా “రెయిడ్ 2” ఓ కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వలేకపోయింది.
విశ్లేషణ: ఎలివేషన్ కంటే గ్రిప్పింగ్ డ్రామా ఈ తరహా సినిమాలకు చాలా అవసరం. లేకపోతే.. ఎంతో పొటెన్షియల్ ఉన్న కథ, సింపుల్ గా ముగిసిపోతుంది. “రెయిడ్ 2” విషయంలో అదే జరిగింది. మంచి క్యాస్టింగ్, థ్రిల్లింగ్ కోర్ పాయింట్ ఉన్నప్పటికీ.. సరైన డ్రామా, ఎంగేజింగ్ ట్విస్టులు కొరవడడంతో ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: డీసెంట్ బట్ నాట్ ఎక్సలెంట్!
రేటింగ్: 2.5/5