‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తే వచ్చింది అనే విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి నేరుగా నామినేట్ కాకపోయినా వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేసి ఓ నామినేషన్ సంపాదించారు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. అయితే తొలి ప్రయత్నంలో ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ పురస్కారం సంపాదించి అదుర్స్ అనిపించారు. అయితే సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాటలు వింటుంటే రాజమౌళి ఆలోచనలు ఇక్కడితో ఆగేలా లేవు. అయితే.. ఇంకా చాలా అవార్డుల్లో ఈ సినిమాను నిలబెడతారా అనుకుంటున్నారా? అవన్నీ అయిపోయాయి లెండి. నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలు అలా ఉన్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ ప్రస్తుతం ఆస్కార్ సాధించిన ఆనందంలో ఉంది. శుక్రవారం ఉదయమే హైదరాబాద్‌లో లాండ్ అయ్యారు. ఈ క్రమంలో అభిమానులు టీమ్‌కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అయితే ఈ లోపు ఈ సినిమా రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ అవార్డు నేపథ్యంలో తన ఆనందాన్ని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ నెక్స్ట్ ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆయన చెప్పింది చూస్తుంటే రాజమౌళి కుంభస్థలం ఒక్క ఆస్కార్ కాదు అని అర్థమైపోతోంది. ఆస్కార్ అవార్డుల్లో ఉన్న 20 కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కేవలం ఒక అవార్డు మాత్రమే గెలుచుకుంది. తదుపరి మరిన్ని కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకోవాలన్నది మా లక్ష్యం అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. దానికి ఉదాహరణగా ఈ ఏడాది ఆస్కార్‌లో అవార్డుల పంట పండించుకున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్’ చిత్రాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.
ఆ సినిమా ఆస్కార్ బరిలో 11 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఆ తర్వాత ఏకంగా ఏడు అవార్డులు దక్కించుకుంది. అంత అద్భుతమైన సినిమా అది. మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్నదే మా లక్ష్యం విజయేంద్ర ప్రసాద్ అని వెల్లడించారు. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్‌బాబుతో అనే విషయం తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో కాదు, హాలీవుడ్ టీమ్‌తో తెరకెక్కించాలని చూస్తున్నారు. దానికి తగ్గ బేస్‌ను రాజమౌళిని ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఇప్పటికే క్రియేట్ చేసుకున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.