హాలీవుడ్ & బాలీవుడ్ లో సినిమా ప్రారంభోత్సవం రోజునే రిలీజ్ డేట్ లేదా రిలీజింగ్ మంత్ ను ఎనౌన్స్ చేస్తారు. ఎందుకంటే.. తమ చిత్రానికి పోటీగా వచ్చే సినిమాలకు హింట్ ఇవ్వడమే కాకుండా మార్కెట్ పరంగానూ సమస్యలు తలెట్టకూడదనే ఉద్దేశ్యంతో అలా చేస్తుంటారు. కానీ.. మన సౌత్ లో ఈ పద్ధతి ఇంకా అలవడలేదు. సినిమా రిలీజ్ కి కనీసం నెల ముందు కూడా ఎనౌన్స్ మెంట్ ఇవ్వడానికి నిర్మాతలు భయపడుతున్నారు. అందుకు కారణం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడమే. ఫలానా రోజున వస్తున్నామని డేట్స్ తో సహా పేపర్ యాడ్స్ ఇచ్చేసిన తర్వాత కూడా కారణాంతరాల వలన రిలీజ్ ఆగిపోయిన సినిమాలు కోకొల్లలు.
ఒక మీడియం బడ్జెట్ సినిమాను సైతం పెద్ద సినిమాకి పోటీగా రిలీజ్ చేయడానికి భయపడుతున్న తరుణంలో చిన్న సినిమాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. ఇటీవల అలా పలుమార్లు రిలీజ్ డేట్ ఛేంజ్ చేసి హల్ చల్ చేసిన చిత్రం “రోబో 2.0”. రజనీకాంత్-అక్షయ్ కుమార్-అమీ జాక్సన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. 400 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ భారీ స్కైఫై మూవీ నిజానికి అక్టోబర్ లో దీపావళి కానుకగా విడుదలవ్వాలి కానీ.. సీజీ వర్క్ కారణంగా జనవరికి పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ చివరి నిమిషంలో ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. దాంతో.. అప్పటివరకూ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేసుకొన్న చిన్నాపెద్దా హీరోలందరూ కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఏప్రిల్ లో ఆల్రెడీ బన్నీ-మహేష్ బాబులు ఏప్రిల్ 27న తమ చిత్రాలను విడుదల చేస్తున్నట్లు సదరు చిత్రాల నిర్మాతలు మీడియా ఎనౌన్స్ మెంట్ చేయగా.. ఇప్పుడు సడన్ గా సూపర్ స్టార్ రజనీ ఏప్రిల్ 13న “2.0” చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలియడంతో ఆ రెండు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లో ఏవైనా ఛేంజస్ వస్తే ఆ సినిమాల తర్వాత లేదా ముందు తమ చిత్రాళ్ను రిలీజ్ చేద్దామనుకొని ప్లాన్ చేసుకొన్న నిర్మాతలు తమ సినిమాలను ఉన్నపళంగా రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఒకే ఒక్క సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల.
ఇంతలా హడావుడి చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యి ఆడియన్స్ ను అలరిస్తే పర్లేదు కానీ.. రజనీ మునుపటి చిత్రం “కబాలి” మాదిరి దెబ్బేసిందంటే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. సో, విషయాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటే అందరికీ మంచిది.