సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ అందిస్తున్నారు. 2019 ఏడాదికి గానూ ఆయన ఈ అవార్డుని అందుకోనున్నారు. ఈ అవార్డు తనను వరించడం పట్ల రజినీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజినీకాంత్ ఈ అవార్డుని అందుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసం వద్ద రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం తనకెంతో ఆనందంగా ఉందని.. ఆ అవార్డు తనకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదని అన్నారు. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ మన మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత రజినీకాంత్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడంతో పాటు తన కుమార్తె సౌందర్య ఎంతో శ్రమించి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ని తాను విడుదల చేయనున్నట్లు రజనీ తెలిపారు. ఇప్పటి వరకు రజినీకాంత్ 168 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన 168వ సినిమా ‘అన్నాత్తే’ను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.