సినిమా పరిశ్రమలో గోల్డెన్ లెగ్ – ఐరన్ లెగ్‌కి మధ్య దూరం ఎంత అంటే? ఒక్క శుక్రవారం అని చెప్పొచ్చు. అవును, ఓ శుక్రవారం సినిమా వచ్చి వెళ్లిపోతే చాలు.. వాళ్ల లక్ ఫ్యాక్టర్ మారిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. ఒకరు సౌత్‌లో ఉంటే, మరొకరు సౌత్ నుండి ఇటీవలే నార్త్‌కి వెళ్లారు. ఇప్పటికే సౌత్ సినిమాల భామ గురించి అందరూ మాట్లాడేశారు. కాబట్టి తొలుత ఆ రెండో భామ గురించి మాట్లాడదాం.
దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో నార్త్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్‌కి వెళ్లడం హీరోయిన్లకు అలవాటు. ఇక్కడ రాణించాం, అక్కడ కూడా రాణించేస్తాం అని వెళ్తుంటారు. అక్కడికెళ్లాక ఇక్కడికి రాలేక, వచ్చే అవకాశం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దాదాపుగా అలాంటి పరిస్థితికి దగ్గర్లో ఉన్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ వెళ్లాక బాయ్ ఫ్రెండ్‌ని అయితే దొరికాడు కానీ, విజయం అయితే దొరకడం లేదు.
రకుల్ ప్రీత్ నుండి ఈ ఏడాది వరుస సినిమాలొస్తాయి అని చదివే ఉంటారు వార్త మన సైట్‌లో. అనుకున్నట్టుగానే ఈ ఏడాది ఆమె నుండి రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ‘అటాక్’, రెండోది ‘రన్‌వే 34’. ఈ రెండు సినిమా ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి రకుల్‌కి. దీంతో విజయం కోసం ఆమె ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఆమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మరి అవేమవుతాయి అనేదే ప్రశ్న.
అలా అని చెప్పి రకుల్ ఇదే తొలిసారి బాలీవుడ్‌కి వెళ్లడమా అంటే 2014లోనే తొలి సినిమా చేసింది. ‘యారియా’ పేరుతో ఓ సినిమా చేసింది.. ఫలితం ఇప్పుడు వచ్చిన ఫలితమే. దీంతో మళ్లీ సౌత్‌కి వచ్చేసింది. మధ్యలో అడపాదడపా అక్కడ సినిమాలు చేస్తున్నా.. విజయాలు అయితే రావడం లేదు. దీంతో రకుల్ విజయాల బోణీ పడటం లేదు. ఇదంతా ఓకే ఆ రెండో హీరోయిన్ ఎవరు అనేగా ప్రశ్న. ఇంకెవరు మన పూజా హెగ్డే. వరుస పరాజాయలతో ఐరెన్ లెగ్‌గా మారింది కదా ఇటీవల.