‘గేమ్ ఛేంజర్’గా త్వరలో పాన్ ఇండియా లెవల్‌లో రాబోతున్నాడు రామ్‌చరణ్. ఆ సినిమా కోసం, ఆ సినిమా అప్‌డేట్ల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ అప్‌డేట్‌లు రావడం లేదు కానీ.. నిజమైన గేమ్ ఛేంజర్ ఎవరు అనే క్లారిటీ మాత్రం వచ్చేసింది. అయితే అది ఆ సినిమా విషయంలో కాదు, నిజ జీవితంలో. ఈ మేరకు రామ్‌చరణ్ ఓ ట్వీట్ చేసి విషెష్ చెబుతూ ఈ మాట అన్నారు. ఆయన మాటల ప్రకారం ఆ గేమ్‌ఛేంజర్ దర్శకుడు శంకర్. అవును ఆయనేనట.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నిజమైన ‘గేమ్ ఛేంజర్’ దర్శకుడు శంకర్ అని రామ్‌చరణ్ అన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. దర్శకుడు శంకర్ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చరణ్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ జులై 30, 1994న విడుదలైంది. దీంతో శంకర్ సినిమా కెరీర్ మొదలై 30 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శంకర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్‌చరణ్ ఆయన్ను ఆకాశానికెత్తేశాడు.
శంకర్ – చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది దిల్ రాజు నిర్మాణంలో 50వ సినిమా కావడం గమనార్హం. ఈ ఏడాది డిసెంబరులో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాదికే సినిమా వెళ్తుంది అంటున్నారు.
ఇక శంకర్‌ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘జెంటిల్‌మేన్’ సినిమాకు మరోవైపు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఆ సినిమా నిర్మాత కెటి కుంజుమన్ ‘జెంటిల్‌మేన్ 2’ని నిర్మిస్తున్నారు. నయనతార చక్రవర్తి, ప్రియాలాల్‌ని హీరోయిన్లుగా ఎంపిక చేశారు. హీరో, దర్శకుడు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.