రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ కలక్షన్ల పరంగా రికార్డులను సృష్టించడమే కాకుండా మరిన్ని భారీ చిత్రాలను రూపొందించడానికి నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒక తెలుగు సినిమాకు వెయ్యికోట్ల కలక్షన్స్ రాబట్టే సత్తా ఉందని బాహుబలి నిరూపించడంతో భారీ ప్రాజెక్టుల్ని చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త డా. బి. ఆర్.శెట్టి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 1000 కోట్లతో ‘మహాభారతం’ అనౌన్స్ చేశారు. తాజాగా రామాయణం తెరపైకొచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌తో మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి నిర్మించనున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందించనున్నారు.
ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. మేం అదే ప్రయత్నం చేయబోతున్నాం. మాకు ఇదో పెద్ద బాధ్యత’’ అన్నారు. నటీనటులు, టెక్నీషియన్లు ఎంపిక త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సెలక్షన్ పూర్తి అయిన వెంటనే నవంబరులో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.