‘పుష్ప 1’లో (Pushpa) శ్రీవల్లిగా రష్మిక మందన్నకు (Rashmika Mandanna) మంచి గుర్తింపు వచ్చినా, ఆమె పాత్రలో డెప్త్ లేకపోవడం కొందరిని నిరాశపరిచింది. ఆమెకు సాంగ్స్, రొమాంటిక్ సీన్లకు మాత్రమే స్కోప్ దొరికింది. అయితే, ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) విడుదలకు ముందు, రష్మిక ఈసారి తన పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పింది. ఫ్యాన్స్ ఆమె మాటలపై ఆసక్తిగా ఎదురుచూస్తూ, కథలో ఆమె పాత్రకు ఎంత మేర వెయిట్ ఉందో తెలుసుకోవాలని చూశారు. మూవీ ఫస్ట్ హాఫ్‌లో ఆమె పాత్ర మరీ ప్రాముఖ్యంగా లేకపోవడం గమనార్హం.
Rashmika
ఆమె బన్నీతో కెమిస్ట్రీ మెరుపులు, కొన్ని ఆసక్తికర సన్నివేశాలు మాత్రమే చూపించింది. కానీ, సెకండాఫ్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. రష్మికకు ఇచ్చిన ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా ఆమె తన భర్త పుష్పరాజ్‌ను అవమానించిన వారిపై గట్టిగా క్లాస్ తీసుకునే సన్నివేశం, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ సీన్‌లో ఆమె పుష్పరాజ్‌ను మరిపించేంత పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. రష్మిక మునుపటి పాత్రలతో పోల్చితే, ఇది ఆమెకు ఛాలెంజింగ్ రోల్.
“జాతర” పాటలో ఆమె డాన్స్, తర్వాత వచ్చిన సీరియస్ ఎపిసోడ్‌లో ఆమె డైలాగ్ డెలివరీకు థియేటర్స్‌లో చప్పట్లు పడ్డాయి. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్‌తో కలిసి తెరపై మెరిసిన ఆమె, ఇప్పుడు అల్లు అర్జున్‌ను మరిపించే విధంగా పుష్ప 2లో నటించింది. ఇది రష్మిక కెరీర్‌లో మరో బెస్ట్ రోల్ గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె పాత్ర కీలకమైన మలుపు తిరగడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
బలమైన ఎమోషనల్ సన్నివేశాలు, టేకింగ్ ఆమె పాత్రను మరింత ఎలివేట్ చేశాయి. ఈ సినిమా ద్వారా రష్మికకు ఉత్తరాది మార్కెట్‌లో మరింత గుర్తింపు వచ్చింది. ఇప్పటికే యానిమల్ సినిమా సక్సెస్ తో ఆమెకు హిందీలో భారీ క్రేజ్ ఏర్పడింది. ‘పుష్ప 2’లో రష్మిక పర్‌ఫార్మెన్స్ ఆమె తదుపరి ప్రాజెక్ట్‌లకు ఉపయోగపడుతుందని చెప్పాలి. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మరో రేంజ్ కు చేరేలా చేస్తాయనడంలో సందేహం లేదు.