ఈ మధ్యకాలంలో ఓటీటీ రిలీజ్ లు కాస్త తగ్గాయి. జనాలు థియేటర్లకు వస్తుండడంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొన్ని సినిమాలకైతే ఓటీటీ పెడుతోన్న కండీషన్స్, ఆఫర్ చేస్తోన్న రేట్లు మరీ అన్యాయంగా ఉంటున్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో తమ సినిమాలకు మార్కెట్ లేదని తెలిసి కూడా కొందరు నిర్మాతలు బిగ్ స్క్రీన్ కి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్న ఒక క్రేజీ సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అవ్వడం వార్తల్లో నిలిచింది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. 2023 జనవరి ప్రీమియర్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ డెబ్యూ జరగాల్సింది. కానీ నిర్మాణం ఆలస్యం కావడంతో ‘గుడ్ బై’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అమితాబ్ కూతురిగా నటించింది. ఇక ‘మిషన్ మజ్ను’ సినిమా విషయానికొస్తే..
ఇదొక స్పై థ్రిల్లర్. దీన్ని శంతను భాగ్ఛీ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను సడెన్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం ఏమై ఉంటుందా..? అని చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో నార్త్ ఆడియన్స్ లో రెగ్యులర్ కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకత కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
క్యాస్టింగ్ బట్టి, ట్రైలర్ ను చూసి జనాలు థియేటర్లకు రావడం లేదు. అందుకే ‘మిషన్ మజ్ను’ అవుట్ పుట్ బాగున్నా.. లేకపోయినా.. ఈ సినిమాను థియేటర్లో చూస్తారో లేదోననే భయంతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మేకర్స్. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు.