ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను, మరో భాషలో రీమేక్ చేయడం సహజం. ఆ కథను ప్రేక్షకులు ఆదరించారు కనుక.. ఎక్కడైనా ఆ కథ నచ్చుతుంది అనుకోవడం నమ్మకం. ఆ నమ్మకమే కొన్ని సార్లు దెబ్బకొడుతుంది. ఆ కథలోని ఆత్మను చక్కగా తెరకెక్కించకపోయినా, నేటివిటీకి తగినట్లు మార్పులు చేయక పోయినా, అతిగా మార్పులు చేసినా సినిమా బోల్తా కొట్టే ప్రమాదం ఉంది. అలా ఇతర భాషల్లో హిట్ అయి.. తెలుగులో రీమేక్ అయిన తర్వాత ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలపై ఫోకస్..
1. వెన్స్ డే – ఈనాడుబాలీవుడ్ నటులు నషీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన గొప్ప చిత్రం వెన్స్ డే. 2008 లో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ అనేక రెట్ల లాభాలను తెచ్చి పెట్టింది. దీనిని తెలుగులో ఈనాడు పేరుతో రీమేక్ చేశారు. విక్టరీ వెంకటేష్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటించినప్పటికీ ఇక్కడి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు.
2. బంటీ ఔర్ బబ్లీ – భలే దొంగలుఅభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ తదితరులు నటించిన బంటీ ఔర్ బబ్లీ కలక్షన్ల సునామీ సృష్టించింది. ఆ కథతో తెలుగులో రూపొందిన చిత్రం భలేదొంగలు. ఇందులో హీరో హీరోయిన్లుగా తరుణ్, ఇలియానా నటించారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
3. కహాని – అనామికడర్టీ పిశ్చర్ విజయోత్సహంలో ఉన్న విద్యాబాలన్ డిఫరెంట్ జాన్రాలో చేసిన మూవీ కహానీ. విద్య ఒంటి చేత్తో ఈ చిత్రాన్ని విజయ తీరానికి చేర్చింది. కోట్లను కొల్లగొట్టిన ఈ మూవీని యూత్ ఫుల్ చిత్రాలు తీసే డైరక్టర్ శేఖర్ కమ్ముల తెలుగులో అనామిక గా తీశారు. విద్యాబాలన్ పాత్రను నయన తారా చక్కగా పోషించినప్పటికీ హిట్ సాధించలేక పోయింది.
4. బోల్ బచ్చన్ – మసాలాబాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ బోల్ బచ్చన్. కన్ ఫ్యూజన్ కామెడీతో కనక వర్షం కురిపించిన ఈ కథతో తెలుగులో మసాలా అనే మూవీ వచ్చింది. విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ హీరో రామ్ లు ఎంత కష్టపడ్డప్పటికీ హిట్ కొట్టలేకపోయారు.
5. సూదుకవ్వమ్ – గడ్డం గ్యాంగ్తమిళంలో ‘సూదుకవ్వం’ అనే చిన్న బడ్జెట్ సినిమా భారీ గా లాభాలను ఆర్జించి పెట్టింది. ఆ కథతో తెలుగులో హీరో రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’గా వచ్చారు. ఎప్పటినుంచి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ కి ఈ సినిమా కూడా పూర్తిగా నిరాశ పరిచింది. ఒక వారం కూడా థియేటర్లో నిలవలేకపోయింది.
6. బ్యాండ్ బాజా బారాత్ – ఆహా కళ్యాణంరణవీర్ సింగ్ , అనుష్క శర్మ జంటగా నటించిన హిందీ ఫిల్మ్ బ్యాండ్ బాజా బారాత్ యువతని ఉర్రూత లూగించింది. ఈ చిత్రాన్ని తెలుగులో నేచురల్ స్టార్ నాని తో తీశారు. నార్త్ ఇండియన్ కథను సౌత్ ఇండియన్ ప్రజలు రిజెక్ట్ చేశారు.
7. లవ్ ఆజ్ కల్ – తీన్మార్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా తీన్మార్. ఈ స్టోరీ లైన్ ని హిందీలో ఘన విజయం సాధించిన లవ్ ఆజ్ కల్ మూవీ నుంచి తీసుకున్నారు. కథలో కొంత నేటివిటీని జోడించారు. అయినా తీన్మార్ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
8. జంజీర్ – తుఫాన్నలభై ఏళ్ళ క్రితం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ జంజీర్. అప్పట్లో ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది. ఆ యాక్షన్ స్టోరీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగు పెట్టి మెగా పవర్ చూపించాలనుకున్నారు. అదే పేరుతో (జంజీర్ /తుఫాన్) రీమేక్ చేశారు. రెండు భాషల్లో ఈ మూవీ ఆకట్టుకోలేక పోయింది. చెర్రీ కల కలగానే మిగిలింది.
9. మౌన గురు – శంకరవిభిన్నమైన కథలను ఎంచుకునే నారా రోహిత్ తమిళంలో ఘన విజయం సాధించిన ‘మౌన గురు’ చిత్రానికి ఆకర్షితులయ్యారు. దానిని తెలుగులో ‘శంకర’ పేరుతో పునర్‌నిర్మించారు. ఈ సంవత్సరం థియేటర్లో వచ్చిన శంకర నారా రోహిత్ కి మరో ఫ్లాప్ ని అందించింది.
10. విక్కీ డోనర్ – నరుడా డోనారుడాఇప్పటివరకు తెలుగు సినీ పెద్దలు టచ్ చేయని సబ్జెక్ట్ తో రూపొందిన చిత్రం నరుడా డోనారుడా. ఇది కూడా రీమేక్ సినిమానే. ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో విమర్సకుల ప్రశంసలు అందుకున్న విక్కీ డోనర్ కి తెలుగు ఫ్లేవర్ అద్ది అక్కినేని హీరో సుమంత్ ఈ ఏడాది మనకందించారు. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ కథ .. తెలుగువారిని అలరించలేకపోయింది.