అప్పుడెప్పుడో 2014, జూలై నెలలో రాంగోపాల్ వర్మ “పట్ట పగలు” అనే ట్రైలర్ ను విడుదల చేశాడు. వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ మొదటిసారి నటించిన సినిమా అది కూడా హారర్ సినిమా కావడంతో ట్రైలర్ కి భీభత్సమైన స్పందన లభించింది. అయితే.. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా గురించి సౌండ్ లేదు. ఇప్పుడు దాదాపు ఏడేళ్ళ తర్వాత అదే సినిమాకు “దెయ్యం” అని పునః నామకరణం చేసి విడుదల చేశాడు వర్మ. ఈమధ్య వర్మ కొత్త సరుకే ఎవరికీ నచ్చడం లేదు. అలాంటిది ఏడేళ్ళ నాటి సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ: మెకానిక్ శంకర్ (రాజశేఖర్) గారాల కూతురు విజ్జి (స్వాతి దీక్షిత్). అందరమ్మాయిల్లాగే కాలేజ్, ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు. అలాంటి విజ్జి ఉన్నట్లుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలెడుతుంది. మొదట ఇంట్లో వాళ్ళని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కొన్ని చెకప్స్ తర్వాత విజ్జికి దెయ్యం పట్టిందని అవగతమవుతుంది.
అసలు ఆ దెయ్యం ఎవరు? విజ్జి శరీరాన్ని ఎందుకు ఆవహించింది? ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం తండ్రి శంకర్ ఎన్ని ఇబ్బందులుపడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “దెయ్యం”.
నటీనటుల పనితీరు: స్వాతి దీక్షిత్ టైటిల్ పాత్రలో ప్రశంసార్ధమైన నటనతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో రాజశేఖర్ నటన బాగుంది కానీ, ఆయన డబ్బింగ్ మాత్రం సూట్ అవ్వలేదు. సినిమాలో పేరొందిన నటులు చాలా మంది ఉండి, వారందరూ చక్కని నట ప్రతిభ కనబరిచినప్పటికీ.. ఎవరివీ సొంత డబ్బింగులు కాకపోవడంతో ఏ ఒక్కరి పాత్ర కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి మెయిన్ మైనస్ డబ్బింగ్ & సౌండ్ మిక్సింగ్. స్వాతి దీక్షిత్, అనితా చౌదరిలకు తప్ప ఎవరికీ డబ్బింగ్ వాయిస్ సింక్ అవ్వలేదు. దాంతో చూస్తున్న సినిమాకి, అక్కడ వినిపించే మాటలకి ఎక్కడా పొంతన ఉండదు. ఇక మెయిన్ క్యాస్ట్ అందరికీ ఒక్కరే డబ్బింగ్ చెప్పిన భావన కలుగుతుంది. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇద్దరు ముగ్గురికి డబ్బింగ్ చెప్పడం అనేది కొత్త కాకపోయినప్పటికీ.. వాయిస్ లో వేరియేషన్ చూపించకుండా కాస్త గట్టిగా, కొంచెం మెల్లగా డబ్బింగ్ చెప్పడం అనేది వేరియేషన్ కాదు అనే విషయాన్ని సదరు డబ్బింగ్ ఇంచార్జ్ అర్ధం చేసుకుంటే బాగుంటుంది.
సతీష్ ముత్యాల సినిమాకి ఒక హారర్ ఫీల్ తీసుకురావడానికి తన కెమెరాతో నానా కుస్తీలు పడినప్పటికీ.. ఏడేళ్ళ క్రితం సినిమా కావడం, సౌండ్ మిక్సింగ్ కనీస స్థాయిలో లేకపోవడంతో హారర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అనేది కలగదు. ఇక సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా నిలవాల్సిన డి.ఎస్.ఆర్ నేపధ్య సంగీతం మైనస్ లా మిగిలిపోయింది. సౌండ్ మిక్సింగ్ చేయడానికి నిర్మాత సరైన బడ్జెట్ ఇవ్వలేదో ఏమో కానీ.. ఈమధ్యకాలంలో వస్తున్న షార్ట్ ఫిలిమ్స్ కి ఉన్న సౌండ్ క్వాలిటీ కూడా ఈ సినిమాలో కనిపించలేదు.
ఆర్జీవీ దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. ఆయన ఎప్పుడో ఏడేళ్ళ క్రితం దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆయన క్లాసిక్ హారర్ సినిమాల్లోని కొన్ని సీన్లు తీసుకొచ్చి ఇక్కడ రీక్రియేట్ చేశాడు కానీ.. పూర్ ప్రొడక్షన్ డిజైన్ వల్ల అది వర్కవుట్ అవ్వలేదు.
విడుదలవ్వాల్సిన సినిమాలన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడడంతో స్పేస్ దొరికిందని నిర్మాత నట్టి కుమార్ “పట్టపగలు”ని “దెయ్యం”గా మార్చి విడుదల చేసినట్లుగా కనిపిస్తుంది తప్పితే.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ఆయన పరంగా కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోలేదని అర్ధమవుతుంది.
విశ్లేషణ: అసలే కరోనా విపరీతంగా ప్రభలుతోన్న తరుణం, అందులోనూ ఏడేళ్ళ క్రితం సినిమా, అది కూడా ఆర్జీవీ సినిమా. ఈ మూడు రీజన్స్ చాలు సినిమా చూడడం కోసం థియేటర్లకు రావాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి. వర్మ రీసెంట్ గా తీసిన సినిమాల కంటే కాస్త బెటర్ అయినప్పటికీ.. థియేటర్ కి వచ్చి ఆస్వాదించేటంతటి గొప్ప సినిమా మాత్రం కాదు.