లాక్ డౌన్ మొదలైనప్పుడు.. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ఇంట్లో నుండే జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ ను ముందుగా ప్రకటించినట్టు… 2021 జనవరి 8నే విడుదల చేస్తాము’.. అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. కానీ కనీసం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోని కూడా విడుదల చెయ్యలేకపోయాడు. ఎలాగూ ‘ఆర్.ఆర్.ఆర్’.. 2021 సంక్రాంతికి విడుదల కాదు అని నిర్మాత దానయ్యే కన్ఫర్మ్ చేసేసాడు. కనీసం ఆ ఏడాది ఉగాదికో లేదా దసరాకో అయినా ఈ చిత్రం విడుదలవుతుందా? అంటే.. అది కూడా కష్టమనే చెప్పాలి.
ఎందుకంటే.. ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడి ఇప్పటికే 4 నెలలు పూర్తయ్యింది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కూడా హాలీవుడ్ భామే అన్న సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి చాలా కష్టమనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా.. ముందుగా అనుకున్న షెడ్యూల్ కు హాజరు కాలేనని రాజమౌళికి చెప్పిందట. మరోపక్క 2021 జనవరి వరకూ ఈ చిత్రం షూటింగ్ మొదలు కావడం కష్టమేననే టాక్ బలంగా వినిపిస్తుంది.
అసలే రాజమౌళి ఒక్క సీన్ నే ఐదేసి రోజులు తీస్తాడు అనే టాక్ ఎలాగు ఉంది. ఒక వేళ షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకే నాలుగేసి నెలలు టైం తీసుకుంటాడనే టాక్ కూడా ఎప్పటినుండో ఉంది. ఆ రకంగా చూసుకుంటే 2021 ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల లేనట్టేనని స్పష్టమవుతుంది. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ లకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.