కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ ఇద్దరే. విలక్షణ పాత్రలతో విశ్వనటుడు అనిపించుకున్నది ఒకరైతే.. ఫుల్ ఎనర్జీతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వారు మరొకరు. దాదాపు నలభై ఏళ్లపాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ నటులు ఒకే సమయంలో నేతలుగా మారుతున్నారు. రజినీ పార్టీ ప్రకటిస్తాను అంటే.. కమల్ హాసన్ పార్టీని ప్రకటించేశారు. అయితే రానున్న ఎన్నికలలోపు సమయానికి కొన్ని చిత్రాలను కంప్లీట్ చేసి.. ప్రజల సేవల్లో మునిగిపోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రజినీ కాంత్ శంకర్ దర్శకత్వంలో 2 .౦ చేస్తున్నారు. ఇందుకు గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతోంది. అలాగే పా రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమాని పూర్తి చేశారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.
దీని తర్వాత “పిజ్జా” సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించిన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇదే రజినీ చివరి చిత్రమని కోలీవుడ్ మీడియా చెబుతోంది. కమల్ విషయానికి వస్తే .. అతను నటించిన విశ్వరూపం–2, శభాష్‌నాయుడు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే శంకర్ కి భారతీయుడు 2 చేస్తానని కమల్ మాట ఇచ్చారు. ఇదే అతని ఆఖరి చిత్రం కానుందని సమాచారం. ఇక తమ అభిమాన హీరోలైన రజినీ, కమల్ హాసన్ పక్కన నటించాలని నయనతార, అనుష్క, త్రిషలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇక రజినీ, కమల్ కి ఉన్నదీ ఒక్కో చిత్రమే కాబట్టి ఎలాగైనా వాటిలో ఛాన్స్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ ఆ లక్కీ ఛాన్స్ వరిస్తుందో చూడాలి.