బాలకృష్ణ కోపం చూడాలంటే సినిమాలకే వెళ్లక్కర్లేదు. ఆయన ఏదైనా కార్యక్రమం కోసం బయటకు వచ్చినప్పుడు అభిమానులు, అక్కడి వాళ్లతో ప్రవర్తించే తీరు చూసిన తెలిసిపోతుంది. ఎందుకో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆయనకు కోపం ముంచుకొచ్చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి అభిమానులపై ఆయన చేయి కూడా చేసుకుంటారు. అలా ఆయన చేతితో దెబ్బలు తిన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఆయన అలా కొట్టడానికి ఓ కారణం ఉంది అని అంటున్నారు ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అభిమానులను కొట్టడం గురించి ఓ సందర్భంలో బాలయ్య దగ్గర సాయి మాధవ్ ప్రస్తావించారట. అప్పుడు బాలయ్య మాట్లాడుతూ ‘‘నాకు, అభిమానులకు మధ్య ఎవరూ ఉండకూడదు. వాళ్లు నా కుటుంబం. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడంలో తప్పులేదు. మామూలుగా వేరే హీరోలు అభిమానుల నుంచి కాపాడుకోవడానికి బౌన్సర్లను పెట్టుకుంటారు. ఎవరైనా అభిమానులు ఆ హీరో మీదికొస్తే ఆ బౌన్సర్లు నెట్టేస్తారు.
లేదంటే కొడతారు. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులను కొట్టడానికే జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకుంటారు. అయినా నా అభిమానులను కొట్టడానికి బౌన్సర్లు ఎవరు? వాళ్లను కొడితే గిడితే నేనే కొడతా. అసలు హీరోలు బౌన్సర్లను పెట్టుకోవడం ఏంటి’’ అని అన్నారట బాలయ్య. బాలయ్య చెప్పిన సమాధానం సాయిమాధవ్‌కు చాలా నచ్చిందట. మరి ఈ విషయం ఓపెన్‌గా చెప్పొచ్చు కదా అని అంటే.. ‘నాకా అలవాటు లేదు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు’ అని బాలయ్య అన్నారట.
బాలయ్య జనాల్లోకి వెళ్లినపుడు అభిమానులు ఆయన్ని చూడ్డానికి, చెయ్యి కలపడానికి మీద పడడం.. ఆ క్రమంలో బాలయ్య కొట్టడం చాలాసార్లు జరిగింది. బాలయ్య కొట్టినా సంతోషమే, తమకేమీ బాధ లేదంటుంటారు అభిమానులు. బాలయ్య కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘నేను కొట్టినా అభిమానులు పట్టించుకోరు. నా చేయి తాకిందని సంతోషిస్తారు’’ అని అన్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కూడా ఇలానే అన్నారు. ‘‘బాలయ్యకు బౌన్సర్లు ఉండరు. తన అభిమానులను తనే అదుపు చేసుకుంటారు’’ అని అన్నారు.