గ్లామర్ ప్రపంచంలో కేవలం నటననే నమ్ముకుని స్టార్డమ్ తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆ విషయంలో సాయి పల్లవి రూటే సెపరేటు. అయితే ఇప్పుడు ఈ నేచురల్ బ్యూటీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చేతికి వచ్చిన భారీ ప్రాజెక్టులను కూడా హోల్డ్ లో పెడుతూ, ఆచితూచి అడుగులు వేస్తోంది. దీని వెనుక ఉన్న అసలు కారణం ఆమె నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ అని తెలుస్తోంది.
Ramayana
దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ తో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ఇతిహాసంలో సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. ఈ పాత్ర తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తుందని ఆమె బలంగా నమ్ముతోంది. లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే దొరికే ఇలాంటి డివైన్ రోల్ చేశాక, వెంటనే రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుందని భయపడుతోందట. సీత పాత్ర తెచ్చే గౌరవాన్ని నిలబెట్టుకునేలా తదుపరి సినిమాలు ఉండాలని ఆమె ఫిక్స్ అయ్యారు.
నిజానికి ఆమె తలుపు తడుతున్న అవకాశాలు చిన్నవి కావు. సాక్షాత్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా ఆఫర్ వచ్చింది. అలాగే వెట్రిమారన్, శింబు కాంబినేషన్ లో ‘అరసన్’ అనే సినిమా కోసం కూడా ఆమెనే సంప్రదించారు. కానీ రెమ్యునరేషన్ పరంగా 15 కోట్లు డిమాండ్ చేయడమో, లేదా పాత్ర పరంగా ఇంకాస్త క్లారిటీ కావాలనో.. ఆమె ఇంకా వేటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గతంలో నయనతార ‘శ్రీరామరాజ్యం’, కృతి సనన్ ‘ఆదిపురుష్’ తర్వాత మళ్లీ తమ రెగ్యులర్ గ్లామర్ రూట్ లోకి వచ్చేశారు. కానీ సాయి పల్లవి మాత్రం ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకుంది. సీతమ్మ పాత్రతో ఓ ముద్ర పడ్డాక, అందుకు పూర్తి విరుద్ధమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరని ఆమె భావిస్తున్నట్లుంది. అందుకే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా తొందరపడటం లేదు.
మరోవైపు ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘ఏక్ దిన్’ (అమీర్ ఖాన్ కొడుకు జునైద్ తో) షూటింగ్ పూర్తయినా, విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ‘రామాయణం’తోనే గ్రాండ్ గా జరుగుతుందా? లేక ఈ చిన్న సినిమాతోనా? అనే సందిగ్ధత కూడా నెలకొంది. ఏది ఏమైనా, ‘రామాయణం’ రిలీజ్ అయ్యే వరకు సాయి పల్లవి ఇలాగే సెలెక్టివ్ గా ఉంటారని అర్థమవుతోంది.
