ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గోల్కొండ హైస్కూల్’ తో తెరంగేట్రం చేసిన సంతోష్ శోభన్.. 2015లో వచ్చిన ‘తను నేను’ అనే చిత్రంతో హీరోగా మారాడు. అయితే అతను మొదటి హిట్ అందుకోవడానికి 6 ఏళ్ళ వరకు టైం పట్టింది.తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో ఇతను మొదటి హిట్ అందుకున్నాడు.నిజానికి 2018లో వచ్చిన ‘పేపర్ బాయ్’ చిత్రంతోనే ఇతను హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతాడని అంతా అనుకున్నారు. ఎన్నో సినిమాలకు రచయితగా,సహ రచయితగా పనిచేసి..
ఆ తరువాత దర్శకుడిగా మారి ‘వర్షం’ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన శోభన్ గారి తనయుడు కావడంతో సంతోష్ ను మొదటి నుండీ ప్రభాస్,మహేష్, అల్లు అరవింద్ వంటి వారు ప్రోత్సహిస్తున్నారు. కమెడియన్ లక్ష్మీపతి గారు ఇతనికి స్వయంగా పెదనాన్న అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఇక కార్తీక్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ వారు తమ చిన్న బ్యానర్ అయిన ‘యూవీ కాన్సెప్ట్స్’ పై నిర్మించారు. కథ చాలా చిన్నదే అయినప్పటికీ.. అది మొత్తం హీరో పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో సంతోష్ కు వన్ మెన్ షో చేసే అవకాశం దక్కింది.
ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగ పరచుకుని మంచి మార్కులు కొట్టేశాడు సంతోష్. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఓటిటి లో విడుదలయ్యింది. ఇలా డిజిటల్ రిలీజ్ ఇవ్వడం ఓ రకంగా హీరో సంతోష్ కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలకు ఆల్రెడీ లాభాలు దక్కాయి. ఇక అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ చిత్రానికి వీక్షణలు బాగున్నాయి.నిన్నటి నుండీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. కాబట్టి ఈ వీకెండ్ లోపు అమెజాన్ వారు కూడా లాభాల బాట పట్టడం గ్యారంటీ.భవిష్యత్తులో సంతోష్ చేయబోయే సినిమాలకు ‘ఏక్ మినీ కథ’ ఓటిటి విజయం మంచి మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.