సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా బాలాదిత్య, రాకేందు మౌళి, రవి వర్మ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న ‘మా ఊరి పొలిమేర 2’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా చేతబడుల నేపథ్యంలో వస్తున్న సినిమా. ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా ముందుగా ఓటిటి లో విడుదల చేశారు, దానికి మంచి పేరు రావటంతో, దానికి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2’ తీశారు. దీనికి డాక్టర్ అనిల్ విశ్వనాధ్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ నిజంగానే ఒక ఊరి దగ్గర వున్న స్మశానంలో చేసాము అని సత్యం రాజేష్ చెప్పాడు.
సహజత్వం రావాలంటే స్మశానంలో చేస్తేనే బాగుంటుంది అని దర్శకుడు నమ్మడంతో, దమ్మపేట అనే ఊరి దగ్గర షూటింగ్ చేశామని చెప్పాడు. ఆ వూరు వాళ్ళ సహకారంతోటే చేశామని చెప్పాడు. అయితే ముగ్గులు అవన్నీ కూడా ఒరిజినలే అని కూడా చెప్పారు. షూటింగ్ కూడా రాత్రిపూటే జరిగిందని, షూటింగ్ అయ్యాక ఒక పెద్దాయన వచ్చి ఆ వేసిన ముగ్గులు అవన్నీ జాగ్రత్తగా శుభ్రం చేసి వెళ్ళండి అని రాజేష్ కి చెప్పడమే కాకుండా, ఇవి కావాలని చెయ్యలేదు, నటుడిగా చెయ్యాల్సి వచ్చింది అని వెళ్ళేటప్పుడు చెప్పండి అని కూడా చెప్పాడట ఆ పెద్దాయన.
అప్పటివరకు షూటింగ్ చేసిన (Satyam Rajesh) రాజేష్ కి అప్పుడు భయం వేసింది. షూటింగ్ అయిపోయాక చిన్న మరక కూడా లేకుండా బకెట్ల కొద్దీ నీళ్లు జల్లి పూర్తిగా శుభ్రం చేసానని చెప్పాడు. కానీ ఆరోజు రాత్రి రూమ్ కి వెళ్ళాక రాజేష్ కి అదే మైండ్ లో ఉండటం వలన జ్వరం వచ్చేసిందని చెప్పాడు. రాత్రి విపరీతమైన జ్వరం, మా ఇంటి నుండి ఫోను వచ్చి ఎలా వున్నారు అని అడిగితే, పరవాలేదు బాగున్నాను అని చెప్పాను, కానీ నాకయితే నిద్ర పట్టలేదు, జ్వరం, అంతలా భయం వేసింది అని తన షూటింగ్ అనుభవం చెప్పాడు.
ఈ సినిమాని గీత ఆర్ట్స్ లో విడుదల చేస్తున్నారు, వాళ్ళు సినిమా చూసి నచ్చి తీసుకున్నారు అని తెలిసింది. ‘మా ఊరి పొలిమేర’ హిట్ అవటం, ఇది ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో, అలాగే ఈ జానర్ సినిమాలు వచ్చేవి తక్కువ, అలాగే ఈ రకం సినిమాల కోసం కూడా కొంతమంది ప్రేక్షకులు ఎదురు చూస్తూవుంటారు, అందుకని ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది అని అంటున్నారు.